పటాన్‌చెరు: అమీన్‌పూర్‌లోని కాలనీల మధ్య ఎస్టీపీ (స్యూవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్) నిర్మాణం ఆపివేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాభీష్టం మేరకు ఎస్టీపీని ఇక్కడ నిర్మించవద్దని మెట్రో వాటర్ వర్క్స్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గానికి మొత్తం ఏడు ఎస్టీపీలు మంజూరయ్యాయని కానీ కాలనీవాసుల ఇబ్బందులను, నిరసనను దృష్టిలో పెట్టుకుని వేరే చోటుకు తరలిస్తామని అమీన్‌పూర్ వాసులకు ఎమ్మెల్యే హామీనిచ్చారు. అమీన్‌పూర్ పీపుల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆకుల తిరుమల్‌రెడ్డి ఆధ్వర్యంలో అమీన్‌పూర్ పట్టణంలో ముమ్మర నిరసన కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్టీపీ ఆవశ్యకత, దానిపై ప్రజల్లో ఉన్న అపోహల తొలగింపు కోసం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మెట్రో వాటర్ వర్క్స్ ఉన్నతాధికారులతో, అమీన్‌పూర్ గుట్టలో శనివారం అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి హాజరైన వేలమంది ప్రజలు అక్కడ ఎస్టీపీ ఏర్పాటు చేయవద్దని కోరారు. దీంతో ఎమ్మెల్యే గూడెం కల్పించుకుని కాలనీ వాసుల కోరిక మేరకు ఎస్టీపీని ఇక్కడ ఏర్పాటు చేయవద్దని ప్రభుత్వానికి విన్నవిస్తామన్నారు.
తిరుమల్‌రెడ్డి పోటీ చెయ్ రూ.10కోట్లు ఇస్తా
ఇదిలాఉండగా సమావేశంలో తొలుత ఎమ్మెల్యే గూడెం మాట్లాడుతూ..ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో తప్పులేదని అయితే అనవసర రాజకీయాలు చేయవద్దని తిరుమల్‌రెడ్డిని హెచ్చరించారు. దీంతో కాలనీ వాసులకు విస్మయానికి లోనయ్యారు. పటాన్‌చెరు నియోజకవర్గ పునర్విభజనలో ఎమ్మెల్యే ఇక్కడ ఉండరని పక్షపాతం చూపుతున్నారని తనపై దుష్ప్రచారం చేశారంటూ వ్యా ఖ్యానించారు. తిరుమల్‌రెడ్డి! ఎన్నికల్లో పోటీ చెయ్.. రాజకీయాలు ఎక్కువ చేస్తున్నవ్ చేయ్‌వయ్యా ఎన్నికల్లో పోటీచెయ్. రూ.పది కోట్లు ఇస్తా’’అంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు. అనంతరం తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ..తమ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తండ్రి సమానులైన ఎమ్మెల్యే వ్యాఖ్యలను తాను తప్పుగా భావించడం లేదన్నారు. ఆ తరువాత ఎస్టీపీ రద్దు ప్రకటన చేసిన తర్వాత ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తారు. అమీన్‌పూర్ మాజీ కౌన్సిలర్లు, బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు, వివిధ కాలనీ సంఘాల అధ్యక్షులు, మెట్రో అధికారులు, జీహెచ్ ఎంసీ అధికారులు ఇంజనీర్లు పాల్గొన్నారు.
జనారణ్యంగా అమీన్పూర్ గుట్టలు
అమీన్‌పూర్ 993 గుట్టలు జనారణ్యంగా మారాయి. అమీన్‌పూర్ కాలనీల నుంచి వందలాది మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. కొద్దిరోజులుగా ఎస్టీపీ నిర్మాణం కోసం నేల చదును పనులు చేస్తున్నారు. ఎస్టీపీని ఇక్కడ నిర్మించవద్దని అమీన్‌పూర్ పీపుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజల్లో చైతన్యం తెచ్చారు. నెల రోజులుగా నిత్యం ఏదో ఒక కాలనీలో రాత్రి పూట లేదా తెల్లవారుజామున ర్యాలీలు జరిగాయి. ఈ ప్రాంతంలోని కాలనీల్లో ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే ఉండటంతో వారికి అవకాశం చిక్కినప్పుడల్లా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దీంతో ఎమ్మెల్యే చొరవతో మెట్రో అధికారులతో కాలనీవాసులు తమ ఆవేదన చెప్పుకునే అవకాశం కల్పిస్తూ సమావేశాన్ని ఏర్పా టు చేయగా..అనూహ్యంగా వేలాది మంది ప్రజలు ఆ గుట్టల్లోకి తరలి వచ్చారు. వచ్చిన వారిలో అందరూ టెకీలే కావడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం నివ్వెరపోయారు. సాధారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉద్యమాలకు దూరంగా ఉండే తత్వం. బ్యాంకు లోన్ తీసుకుని ఇండ్లు కట్టుకుని ప్రశాంత జీవితాలు సాగించాలనుకునే ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు పిడుగులా ఎస్టీపీ ఏర్పాటు వార్త వచ్చి పడింది. ఎస్టీపీ ఏర్పాటైతే ఇండ్లు అమ్ముకుని, తా ము కాలనీలు ఖాళీ చేయడం మినహా ఏమీ ఉండద ని భావించారు. దీంతో పిల్లా పాపలతో ఎమ్మెల్యే నిర్వహించిన సమావేశానికి తరలి వచ్చారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి


