అవమానిస్తున్నాడని సర్పంచ్ నిరసన
పెద్దశంకరంపేట(మెదక్): పెద్ద శంకరంపేట మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట మహిళా సర్పంచ్ జంగం రేణుక శనివారం నిరసనకు దిగారు. తనను ఉపసర్పంచ్ రాజుగౌడ్ పదేపదే అవమానిస్తున్నారని ఆరోపించారు. మహిళగా తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రేణుక మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ అనుమతి లేకుండా ప్రతి కాలనీలో తనకు నచ్చిన వ్యక్తులకు పంచాయతీ నల్లా కలెక్షన్లు ఇష్టానుసారంగా ఇస్తున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దోమల మందు స్ప్రే చేసి సదరు వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి అంతా తానే చేస్తున్నట్లు చెబుతున్నాడని ఽఆరోపించారు. అనంతరం గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి ఆమె అక్కడే భోజనాలు చేశారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఉప సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, నాయకులు సురేశ్ గౌడ్, సుభాష్ తదితరులున్నారు.


