ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి
మెదక్ జిల్లా కేంద్రంలో నిర్మించిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సీఎస్‌ఐ చర్చి పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ అద్భుత కట్టడాలను కనులారా చూసి తీరాల్సిందే. రోజ్‌వుడ్ కలప, స్పెయిన్ గ్లాస్‌పై కరుణామయుని జీవన వృత్తాంతం, అద్భుతమైన రాతికట్టడం దీని ప్రత్యేకత. దీని నిర్మాణం 1914 నుంచి 1924 వరకు పదేళ్లపాటు కొనసాగింది. ఇంగ్లాండ్ దేశస్తుడైన చార్లేస్ వాకర్ పాస్నెట్ ఆధ్వర్యంలో ఈ అద్భుత కట్టడం ఆవిష్కతమైంది. దీన్ని నిర్మించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా 2023 డిసెంబర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఈ చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
మెదక్ ఖిల్లా చారిత్రక అద్భుత కట్టడం. దీన్ని శత్రుదుర్భేద్యంగా నిర్మించారు. ఇది కాకతీయుల కాలం నాటి 2వ ప్రతాపరుద్రుడు పాలించినట్లు చరిత్ర చెబుతోంది. దానిపై పర్యాటకశాఖ ఆధ్వర్యంలో కాటేజీలు నిర్మించారు. ఇది పోలీస్ పహారాలో కొనసాగుతుంది. ఇది రాచరికపు చరిత్రకు నిలువుటద్దంగా విరాజిల్లుతోంది. ఇది హైదరాబాద్‌కు కేవలం 100 కిలో మీటర్ల దూరంలో ఉండటంతో హైదరాబాద్, రంగారెడ్డి తదితర దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.
తుంబురేశ్వరాలయం
మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని వెల్పుగొండలో వెయ్యేళ్ల క్రితం వెలసిన తుంబురేశ్వర (శివాలయాన్ని) కాకతీయుల ఏలుబడిలో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఆ గుడి చుట్టూ దేవతామూర్తుల విగ్రహాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రతి ఏటా ఫిబ్రవరిలో నాలుగు రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.


