నారాయణఖేడ్: ఖేడ్ మండలంలోని అబ్బెంద గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు సీహెచ్ విఠల్ ‘తెలుగు సాహిత్యంలో రుద్రమదేవి‘ అనే అంశంపై పరిశోధన పూర్తిచేసి ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ పట్టా పొందారు. ఆయన ప్రస్తుతం కోహీర్ మండలంలోని గురుజువాడ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనను స్థానిక ప్రజలు, మిత్రులు, బంధువులు, ఉపాధ్యాయులు అభినందించారు.
జనగణన పకడ్బందీగా నిర్వహించాలి
జెడ్పీ సీఈఓ ఎల్లయ్య
కొల్చారం(నర్సాపూర్): వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే జన గణన–2027 పకడ్బందీగా నిర్వహించాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అధికారులకు సూచించారు. శనివారం మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో జన గణనపై ఎన్యుమిరేటర్లకు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. జన గణనకు వచ్చే సిబ్బందికి ప్రజలు సహకరించి సమాచారం అందజేయాలని ప్రజలను కోరారు. తహసీల్దార్ శ్రీనివాసాచారి మాట్లాడుతూ శిక్షణ శిబిరం ఈనెల 25వరకు కొనసాగుతుందన్నారు. మే 1 నుంచి ఇళ్ల జాబితా, గణనతో పాటు స్వీయ గణన ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నాగవర్దన్, ఎంఈఓ ఉమారాణి, సిబ్బంది పాల్గొన్నారు.
షార్ట్ సర్క్యూట్‌తో
కిరాణాషాపు దగ్ధం
రూ.8 లక్షల ఆస్తి నష్టం
కౌడిపల్లి(నర్సాపూర్): ప్రమాదవశాత్తు కిరాణాషాపు దగ్ధం కావడంతో ఆస్తి నష్టం సంభవించింది. ఈ సంఘటన మండలంలోని వెంకట్రావ్‌పేటగేట్ వద్ద శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఆర్‌ఐ విజయలక్ష్మి, బాధితుడి వివరాల ప్రకారం.. మండలంలోని రాజిపేట గ్రామానికి చెందిన గుండ వీరేశంగుప్తకు వెంకట్రావ్‌పేటగేట్‌వద్ద వేంకటేశ్వర హోల్‌సేల్, రిటైల్ కిరాణాషాపు ఉంది. రోజుమాదిరిగా శనివారం షాపు తెరిచి మధ్యాహ్నం 12గంటల తరువాత కిరాణా సామగ్రి తీసుకొచ్చేందకు షాప్ బంద్‌చేసి హైదరాబాద్‌కు వెళ్లాడు. కొద్దిసేపటికి షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు షాపు ఓపెన్‌చేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం ఫైర్‌సిబ్బంది వచ్చి మంటలార్పారు. అప్పటికే షాపులో ఉన్న సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. ఆర్‌ఐ విజయలక్ష్మి సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. సుమారు రూ.8లక్షలకు పైగా నష్టం జరిగిందని తెలిపారు.


