కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

Apr 19 2026 1:44 PM | Updated on Apr 19 2026 1:44 PM

హత్నూర(సంగారెడ్డి): కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని షేర్‌ఖాన్‌పల్లి గ్రామ శివారులో శనివారం ఉదయం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం... పటాన్‌ చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన మంగలి జోగేందర్‌ (40) కొంతకాలంగా అత్తగారు గ్రామమైన తెల్లాపూర్‌ ఇంద్రనగర్‌లో భార్యాపిల్లలతో కలిసి జీవనం కొనసాగిస్తూ కులవృత్తిని చేసుకొని బతుకుతున్నాడు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సైతం భార్య లావణ్యతో గొడవపడిన జోగేందర్‌ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. బైక్‌పై మండలంలోని షేర్‌ఖాన్‌పల్లి గ్రామ శివారులోని పలుకుమీది నల్ల పోచమ్మ ఆలయం సమీపంలోని రేకుల షెడ్డులో ఉరేసుకున్నాడు. ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ శ్రీధర్‌ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భర్త మృతి

కొండపాక(గజ్వేల్‌): పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దంపతుల్లో భర్త శనివారం తెల్లవారు జామున మృతి చెందాడు. వివరాలు ఇలా... కుకునూరుపల్లి మండలంలోని మేదినీపూర్‌ గ్రామానికి చెందిన భార్యాభర్తలు తాడెం తార, తాడెం మల్లేశంలకు పదేళ్ల కింద వివాహం కాగా సంతానం కలుగలేదు. దీంతో పాటు కుటుంబ తగాదాల నేపథ్యంలో ఇటీవల భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆస్పత్రికి తరలించగా హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో తెల్లవారుజామున భర్త మృతి చెందగా, భార్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ధృవీకరించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలుసుకున్న గజ్వేల్‌ కోర్టు జడ్జి ఆస్పత్రిలో మరణ వాంగ్మూలం సేకరించిన విషయం పాఠకులకు తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement