చేగుంట(తూప్రాన్): ఇంటర్ విద్యాశాఖ డిప్యూటీ కార్యదర్శిగా చేగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని ఇంటర్ విద్యాశాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
ప్రైవేట్ స్కూల్ టీచర్ అదృశ్యం
వర్గల్(గజ్వేల్): ఓ యువతి అదృశ్యమైంది. ఈ ఘటన మండలంలోని గౌరారంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి వివరాల ప్రకారం... కుకునూర్‌పల్లికి చెందిన పోల్కంపల్లి సత్యనారాయణ కూతురు అక్షిత(24) గౌరారంలోని ప్రైవేట్ స్కూలులో టీచర్‌గా పనిచేస్తుంది. రోజు మాదిరిగా ఆమె సోదరుడు శనివారం ఉదయం 9 గంటలకు స్కూల్ ఎదుట దింపి వెళ్లాడు. కానీ ఆమె స్కూల్‌కు గాని, తిరిగి ఇంటికి గాని వెళ్లలేదు. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
డ్రగ్ పట్టివేత
జహీరాబాద్ టౌన్: రాష్ట్ర సరిహద్దులో గల చిరాగ్‌పల్లి చెక్‌పోస్టు వద్ద డ్రగ్‌ను పట్టుకున్నారు. ఎక్సైజ్ సీఐ.శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం.. వాహనాల తనిఖీలో భాగంగా గోవా నుంచి వస్తున్న ట్రావెల్ బస్సుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. రాజస్థాన్‌లోని జోద్‌పూర్ ప్రాంతానికి చెందిన బుద్ధరాం వద్ద 1.052 కిలోగ్రాముల డ్రగ్(చరాస్) లభించింది. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
చిలప్‌చెడ్(నర్సాపూర్): పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ నర్సింహులు వివరాల ప్రకారం... చిలప్‌చెడ్ చర్చి వెనుక పలువురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం వచ్చింది. ఈ మేరకు అక్కడికి వెళ్లి పేకాట ఆడుతున్న వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 4 వేలు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.


