జోగిపేట(అందోల్): విదేశీయుల కోసం జోగిపేటలో ఏర్పాటు చేస్తున్న ట్రాన్సిట్ హోం (విదేశీయుల కేంద్రం)ను త్వరలోనే ప్రారంభించనున్నామని అందుకు ఏర్పాట్లు పూర్తికావచ్చినట్లు హైదరాబాద్ అదనపు సీపీ శ్రీనివాస్ వెల్లడించారు. డీసీపీ చైతన్య, సంగారెడ్డి ఎస్‌పీ పరితోశ్ పంకజ్‌తో కలిసి శుక్రవారం జోగిపేట పాత సబ్‌జైల్‌లో కొనసాగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్ సీసీఎస్‌లో ప్రస్తుతం 9మంది విదేశీయులు ఉన్నారన్నారు. చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించే విదేశీ పౌరులు, పాస్‌పోర్ట్, వీసా తేదీ ముగిసిన తర్వాత కూడా దేశంలో తిరుగుతున్న వారు, జైలుశిక్షను పూర్తి చేసినవారు, పేరోల్‌పై ఉన్నవారు ఇతర రకాల రక్షణ అవసరమైన వారికి తాత్కాలికంగా వసతి కల్పించేందుకు ట్రాన్సిట్‌హోంను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. విదేశీ కేంద్రంలో పురుషులు, మహిళలకు వేర్వేరుగా 70 మంది ఉండేలా వసతులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్, సీఐ అనిల్ కుమార్, ఎస్‌ఐ 2 దుర్గయ్య తదితరులు ఆయన వెంట ఉన్నారు.
హైదరాబాద్ అదనపు సీపీ శ్రీనివాస్


