గడ్డి మందుపై గట్టి నిఘా | - | Sakshi
Sakshi News home page

గడ్డి మందుపై గట్టి నిఘా

Apr 18 2026 8:17 AM | Updated on Apr 18 2026 8:17 AM

రైతులకు అవగాహన కల్పిస్తాం

ప్యారాక్వాట్‌ అమ్మకాలు జరగకుండా వ్యవసాయ శాఖ చర్యలు

విషపూరితం, ప్రాణాంతకంగా మారడంతోనే..

పక్క రాష్ట్రాల నుంచి రాకుండా అడ్డుకట్ట

రైతులకు అవగాహన కల్పిస్తున్నాం: డీఏఓ

జహీరాబాద్‌: ఆహార ధాన్యాలు, పండ్ల తోటల సాగులో కలుపు నివారణకు వాడుతూ వచ్చిన ప్యారాక్వాట్‌ గడ్డి మందుపై ప్రభుత్వం నిషేధం విధించడంతో పకడ్బందీగా అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ కార్యాచరణ చేపట్టింది. ప్రభుత్వం పక్షం రోజుల క్రితం మందు వాడకంపై జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చాయి. ఇకపై గడ్డిమందు వినియోగానికి వ్యవసాయ శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. జిల్లాలో వర్షాకాలం పంటలు 7.60 లక్షల ఎకరాల్లో, యాసంగిలో 2.80 లక్షల ఎకరాల్లో ఆయా రకాల పంటలు సాగవుతూ వస్తున్నాయి. ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, వరి, కంది, పెసర, మినుము, శనగ, చెరకు, అరటి, అల్లం, బొప్పాయి పంటలతో పాటు కూరగాయల పంటలకు కలుపు బెడద ఎక్కువగా ఉండడంతో రైతులు గడ్డి మందును ఆశ్రయిస్తున్నారు. వర్షాలు అనుకూలించని పక్షంలో కలుపు తీయడం రైతులకు శక్తికి మించిన పనిగా మారుతోంది. కూలీలను వినియోగించినా ఖర్చు భారం పడుతోంది. దీంతో రైతులు కలుపు నివారణ మందుల వినియోగానికి మొగ్గు చూపుతున్నారు. గ్లైఫోసెట్‌ రౌండప్‌ మందుపై నిషేధం ఉన్నా అక్రమంగా పక్క రాష్ట్రం నుంచి కొనుగోలు చేసుకుని వినియోగిస్తున్నారు. ప్యారాక్వాట్‌ మొక్కల్లోని ఫోటో సింథసిస్‌ కణాలను నాశనం చేస్తూ కలుపు నివారిణిగా పనిచేస్తోంది. గ్‌లైఫోసెట్‌ మొక్కలను మొత్తం నాశనం చేస్తుంది.

ఏ మేరకు అమలు కానుంది?

ఇప్పటికే మన రాష్ట్రంలో గ్లైఫోసెట్‌ గడ్డిమందుపై నిషేధం ఉంది. కానీ పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో విక్రయాలకు అనుమతి ఉంది. తాజాగా ప్యారాక్వాట్‌ మందుపై నిషేధం విధించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు వ్యవసాయ శాఖ అధికారి లేదా సంబంధిత అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం సదరు అధికారి వ్యవసాయ భూమిని చూసి అనుమతిస్తారు. మందు వినియోగం తప్పని సరి అని ధృవీకరించి సిఫారసుచేస్తే డీలర్‌ వద్ద నుంచి కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ జిల్లాకు పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో గ్లైఫోసెట్‌ గడ్డిమందు విక్రయాలపై నియంత్రణ లేదు. ఈ నేపథ్యంలో రైతులు అక్కడి నుంచి కొనుగోలు చేసి అక్రమంగా తరలించుకునే అవకాశం ఉంది. రైతులకు తగిన అవగాహన కల్పించి చైతన్యం కలిగిస్తేనే ఫలితాలు సాధించవచ్చు.

ప్రాణాంతకంగా మారింది

ప్యారాక్వాట్‌ గడ్డిమందు వినియోగంపై ప్రారంభంలో అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. తదనంతర కాలంలో ఆ గడ్డిమందు అనర్థాలను నిపుణులు గుర్తించారు. ప్యారాక్వాట్‌ వినియోగంతో పర్యావరణపరంగా నష్టంతో పాటు వర్షాలు పడిన అనంతరం కూడా దీని ప్రభావం భూమి, మొక్కల్లో తగ్గడం లేదు. వీటిని పిచికారీ చేసే రైతులు, కూలీలు సైతం దుష్ప్రభావాలకు లోనవుతున్నారు. క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడే వారు ప్యారాక్వాట్‌ సేవిస్తే చికిత్స కూడా అందలేని పరిస్థితి ఉంది. ప్రధాన అవయవాలు దెబ్బతిని మరణం తప్పనిసరిగా మారింది. దుష్ప్రభావాలకు యాంటీడోస్‌ లేకపోవడంతో అత్యంత ప్రమాదకరంగా మారింది.

ప్రభుత్వం నిషేధించిన ప్యారాక్వాట్‌ మందుపై రైతులకు అవగాహన కల్పిస్తాం. ఇప్పటికే రైతు వేదికల్లో నిర్వహించిన సమావేశాల్లో ఈ కార్యక్రమం చేపట్టాం. మార్కెట్లోకి మందు రానప్పుడు రైతులు కొనుగోలు చేసే అవకాశమే ఉండదు. అయినా దీనిపై గట్టి నిఘా ఉంచుతాం. నిబంధనలు ఉల్లంఘించినా, ఎవరైనా మందు అమ్మ కాలు జరిపినా కఠిన చర్యలుంటాయి.

– శివప్రసాద్‌, డీఏఓ, సంగారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement