చెక్‌డ్యాంలతో ప్రయోజనం
● భూగర్భ జలాల పెంపునకు చర్యలు
● ప్రతీ గ్రామంలో రెండింటికి అనుమతి
● పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల నిర్ణయం
నారాయణఖేడ్: ఉపాధిహామీ పథకం కింద చెక్‌డ్యాంలు నిర్మించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు నిర్ణయించాయి. చెరువుల్లో మట్టి పూడికతీత, ఇతరత్రా పనులు మాత్రమే కొనసాగుతుండగా.. గ్రామాల్లో వాన నీటి ప్రవాహాన్ని ఒడిసిపట్టేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఉపాధిహామీ పథకం కింద 14 ఏళ్ల క్రితం వాగులపై చెక్‌డ్యాంల నిర్మాణాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వీటి నిర్మాణం పేరిట నిధులు దుర్వినియోగం జరుగుతోందని భావించి ఈ చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల భూగర్భ జలాల పెంపు, నీటి నిల్వ పనుల కోసం తిరిగి చెక్‌డ్యాంల నిర్మాణాలకు అనుమతినిచ్చింది. ప్రతీ గ్రామంలో రెండింటిని నిర్మించాలని యోచిస్తున్నారు. ఉపాధిహామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ–జీ రాంజీ చట్టం కిందనే పనులను జాబితాలో చేర్చారు.
నాడు వాటర్ షెడ్ ద్వారా..
జిల్లాలో భూగర్భ జలాలు పెంపొందించేందుకు 30 ఏళ్ల క్రితం జిల్లాలో వాటర్‌షెడ్ పథకం కొనసాగింది. నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్ తదితర నియోజకవర్గాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో వాటర్‌షెడ్ పథకం అమలు చేసి చెక్‌డ్యాంలు నిర్మించారు. గట్టు ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటికి అడ్డుకట్టగా, ఇతర ప్రాంతాల నుంచి ప్రవహించే నీటికి అడ్డుకట్టగా వీటి నిర్మాణాలు చేపట్టారు. అప్పట్లో నిర్మించిన ఈ చెక్‌డ్యాంలలో వేసవిలోనూ నీరు నిల్వ ఉండి పశుపక్ష్యాదులకు నీటి దప్పిక తీర్చడం, చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరిగి బోర్లు సమృద్ధిగా పనిచేసేవి. పంచాయతీరాజ్ శాఖ ద్వారా కూడా అప్పట్లో చెక్‌డ్యాంల నిర్మాణాలు చేపట్టారు.
నిర్మాణాలపై అధ్యయనం
గ్రామీణ ప్రాంతాల్లో చెక్‌డ్యాంల అవసరం, నిర్మాణాల అనుకూలతలపై అధ్యయనం చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ ఇటీవల జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు ఎంపీడీవోలు మండలాల వారీగా సర్వే చేయించి నివేదికలు సమర్పించారు. వీటి ఆధారంగా 2026– 27 ఆర్థిక సంవత్సరంలో పనులు చేపట్టేందుకు పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. ఒక్కో చెక్‌డ్యాంకు గరిష్టంగా రూ.6.50లక్షలు ఉపాధి నిధులు వెచ్చించనున్నారు. ఒక్కో నిర్మాణం ద్వారా కూలీలకు 300 పనిదినాలు కల్పిస్తారు. వాగు ప్రవాహ ప్రాంతాలను బట్టి 5 నుంచి 16 మీటర్ల పొడవుతో చెక్‌డ్యాంలను నిర్మించేలా రూపకల్పన చేస్తున్నారు. ఈ పనులను పర్యవేక్షించేందుకు ఎంపీడీవో, పంచాయతీరాజ్ ఏఈ, సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శితో కమిటీని వేయనున్నారు.
చెక్‌డ్యాంల నిర్మాణం వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయి. చిన్న, చిన్న నీటి అడ్డంకులు కావడంతో వర్షపు నీటిని నిల్వచేసి భూగర్భ జలాలు పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చెక్‌డ్యాంలలో నిల్వ చేసే నీరు మెల్ల మెల్లగా నేలలోకి చొచ్చుకుపోయి బోరు, బావుల్లో నీటి మట్టాలు పెంచడం, రైతులకు వేసవి కాలంలోనూ నీరు అందుబాటులో ఉండేలా చేస్తూ పంట దిగుబడులు పెంచేందుకు దోహద పడతాయి. వర్షపు నీరు వేగంగా ప్రవహించకుండా ఆపి మట్టిని కాపాడటం, అకస్మాత్తుగా వచ్చే వరద నీటి ప్రవాహాన్ని తగ్గించడం, పచ్చదనం పెరిగి చెట్లు, పశుపక్ష్యాదులకు నీటి సదుపాయం కలుగనుంది. తక్కువ ఖర్చుతో నిర్మాణాలు జరగనుండటంతో ప్రభుత్వాలు సైతం చెక్‌డ్యాంల నిర్మాణాల పట్ల మొగ్గుచూపుతాయి.


