రెచ్చిపోతున్న కేబుల్‌ దొంగలు | - | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న కేబుల్‌ దొంగలు

Apr 18 2026 8:17 AM | Updated on Apr 18 2026 8:17 AM

వరుసగా మోటార్‌ కేబుల్‌ వైర్లు చోరీ

వరుసగా మోటార్‌ కేబుల్‌ వైర్లు చోరీ

బెంబేలెత్తుతున్న రైతులు

పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం

దుబ్బాక: వ్యవసాయ బోరు మోటార్ల కేబుల్‌ వైర్లను చోరీ చేస్తున్నారు. వరుసగా చోరీలతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా దుబ్బాక పట్టణంతో పాటు మునిపాలిటీ పరిధిలోని చేర్వాపూర్‌, చీకోడ్‌ రోడ్డు, దుంపలపల్లి రోడ్డులో సబ్‌రిజిష్ట్రార్‌ కార్యాలయం ప్రాంతం, బల్వంతాపూర్‌ రోడ్డులో వ్యవసాయ బోరు మోటార్ల కేబుల్‌ వైర్లు గుర్తుతెలియని వ్యక్తులు కట్‌ చేసుకొని ఎత్తుకెళ్లారు. పదిహేను రోజుల క్రితం పట్టణంలోని దుంపలపల్లి రోడ్డులో ఏదుల్ల చెరువు, నల్ల చెరువు, చీకోడ్‌ రూట్లలో వరుసగా సుమారు 50 మంది రైతులకు చెందిన మోటార్ల కేబుల్‌ వైర్లు చోరీకి గురయ్యాయి.

రైతులకు తీవ్ర నష్టం

దొంగలు కేబుల్‌ వైర్లు ఎత్తుకెళ్తుండటంతో రైతులకు ఆర్థికంగా నష్టపోతున్నారు. స్టార్టర్‌ డబ్బా నుంచి బోరు మోటార్‌ వరకు ఉండే విలువైన కేబుల్‌ వైర్‌ను తస్కరిస్తున్నారు. దీంతో రైతులు మళ్లీ మోటార్‌ను పైకి తీయడం , మళ్లీ కొత్త కేబుల్‌ వైర్‌ వేయాల్సి వస్తుండటంతో ఒక్కో రైతుకు రూ.4 నుంచి 5 వేల వరకు ఖర్చు అవుతోంది. దీంతో ఇబ్బందులు పడుతున్నారు. కేబుల్‌ దొంగతనాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొంగలను పట్టుకొని చోరీలను అరికట్టాలని కోరుతున్నారు.

దొంగలను పట్టుకోవాలి

మోటార్ల కేబుల్‌ వైర్ల దొంగతనాలతో ఇబ్బందులు పడుతున్నాం. నాతో పాటు చాలా మంది రైతుల కేబుల్‌ వైర్లు ఎత్తుకెళ్లారు. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నాం. పోలీసులు దొంగలను పట్టుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి.

– కేసుగారి స్వామి, రైతు, దుబ్బాక

Advertisement
 
Advertisement
Advertisement