ములుగు(గజ్వేల్): ఇళ్లలో చోరీలకు పాల్పడిన నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ములుగు ఎస్‌ఐ రఘుపతి కేసు వివరాలు వెల్లడించారు. నెలరోజుల క్రితం మండలంలోని బహిలంపూర్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలోని బొల్లు వెంకటేశం ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ.లక్షా 50 వేలు, మామిడ్యాల ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో పసుల సత్తయ్య ఇంట్లో రూ.65వేలు, 3తులాల వెండి, సెల్‌ఫోన్‌ను అపరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం మధ్యాహ్నం ములుగు బస్టాండ్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు ఎస్‌ఐకి సమాచారం అందింది. వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో అతను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లి తండాకు చెందిన అప్పావత్ శ్రీకాంత్(28)గా గుర్తించారు. అలాగే బహిలంపూర్, ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో చోరీకి పాల్పడింది తానేనని నేరం ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద రూ.50 వేలు నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు పంపించారు. కేసును ఛేదించిన ఎస్‌ఐ, సిబ్బందిని గజ్వేల్ రూరల్ సీఐ డి.రవిరాజు అభినందించారు.


