కారు ఢీకొని వ్యక్తి మృతి
చేర్యాల(సిద్దిపేట): కారు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం మండలంలోని వీరన్నపేట స్టేజీ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్‌ఐ అపూర్వరెడ్డి వివరాల ప్రకారం... చేర్యాల పట్టణ కేంద్రానికి చెందిన తోడెంగల నర్సింహులు(48) ప్రతి రోజు ఉదయం పరిసర గ్రామాలకు వెళ్లి ఆకుకూరలు అమ్ముతుంటాడు. రోజు లాగానే ఉదయం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం వీఎస్‌ఆర్‌నగర్, కట్కూరు గ్రామాల్లో ఆకుకూరలు అమ్మేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో జనగామ వైపు నుంచి సిద్దిపేటకు వస్తున్న కారు ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న నర్సింహులు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.


