జిల్లాలో 1.65 లక్షల జనాభాతో అత్యధికంగా మాదిగలు
కులాన్ని వదులుకున్న వారిలో రాష్ట్రంలోనే జిల్లా మూడో స్థానం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో కులాన్ని వదులుకున్న వారు 32,989 మంది ఉన్నారు. ఇలా ఏ కులమూ లేదని చెప్పిన వారిలో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. మొదటిస్థానంలో జీహెచ్‌ఎంసీ ఉండగా, రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా ఉంది. కాగా సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా మాదిగలు ఉన్నట్లు తేలింది. మొత్తం 1,65,209 మంది మాదిగ ఉప కులానికి చెందిన వారు ఉన్నారు. రెండో స్థానంలో షేక్‌లున్నారు. బీసీ–ఈ కేటగిరీ కింద ఉన్న వీరు 1,61,115 మంది ఉన్నట్లు స్పష్టమైంది. మూడో స్థానంలో ఉన్న ముదిరాజ్‌ల జనాభా 1,55,733గా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎస్టీల్లో లంబాడాలు 91,327 మంది ఉండగా, మాలలు 85,109 మంది ఉన్నారు. 2024లో నిర్వహించిన కులగణనకు సంబంధించిన ఉపకులాల వారీగా జనాభా లెక్కలను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో ఆయా ఉపకులాల వారీగా వివరాలను పరిశీలిస్తే..
జిల్లాలో బీసీలు 6.69 లక్షలు, ఎస్సీలు 2.94 లక్షలు
జిల్లాలో బీసీల జనాభా 6,69,885 ఉన్నట్లు తేలింది. జిల్లా జనాభాలో వీరు 46.26% ఉన్నట్లు గుర్తించారు. ఈ బీసీ కులాల కుటుంబాలు 1,99,250గా లెక్కగట్టారు. ఎస్సీల జనాభా 2.94 లక్షల మంది ఉన్నట్లు కులగణనలో తేలింది. మొత్తం 86,490 ఎస్సీ కుటుంబాలున్నట్లు తేల్చారు. మొత్తం జనాభాలో 20.35% ఎస్సీలుగా గుర్తించారు. ఎస్టీల జనాభా 1,01,233 ఉన్నట్లు గుర్తించారు. 6.99 శాతం మంది ఎస్టీలు ఉన్నారు. వీరి కుటుంబాలు 27,052గా తేలింది. జిల్లాలో ఓసీలు 1,67,620 మంది ఉన్నారు. మొత్తం జనాభాలో 11.57% ఉన్నట్లు లెక్కగట్టారు. 50,103 ఓసీ కుటుంబాలున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
1.61 లక్షలతో రెండో స్థానంలో షేక్‌లు
1.55 లక్షలతో మూడో స్థానంలో ముదిరాజులు
లంబాడాలు 91,329
ఉప కులాల వారీగా కులగణన లెక్కలు విడుదల చేసిన ప్రభుత్వం


