అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామ సర్పంచ్‌లు
కొండాపూర్(సంగారెడ్డి): సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అధికారులు విఫలమవుతున్నారని పలు గ్రామాల సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండాపూర్‌లో గురువారం జరిగిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు వస్తున్నాయో కనీసం సర్పంచ్‌లకు కూడా సమాచారం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ చీరల పంపిణీ విషయంలో కూడా సర్పంచ్‌లకు సమాచారం ఇవ్వకుండా మహిళా సంఘాల ద్వారా పంపిణీ చేశారని, అధికార పార్టీ సర్పంచ్ అయినప్పటికీ సమాచారం ఇవ్వకపోవడంపై మల్కాపూర్ సర్పంచ్ అనిల్ కుమార్ మండిపడ్డారు. గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, లీకేజీ అవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని చెప్పారు. మండల ప్రత్యేకాధికారి వైద్యనాథ్ మాట్లాడుతూ..ప్రభుత్వానికి అధికారులు, ప్రజాప్రతినిధులు బండికి రెండు చక్రాల వంటి వారని, ఈ రెండు సమానంగా ఉంటేనే అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.
ఎంపీకి ప్రొటోకాల్ లేదా?
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన బ్యానర్ వివాదాస్పదంగా మారింది. ఏదైనా ప్రభుత్వం తరఫున సమావేశాలు, సభలు నిర్వహించినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజా ప్రతినిధుల ఫొటోలు ప్రొటోకాల్ ప్రకారం తప్పనిసరిగా ప్రచురించాల్సి ఉంటుంది. అయితే బ్యానర్‌లో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఫొటోను ప్రచురించలేదు. అధికారులే స్వయంగా ఎంపీ ఫొటోను బ్యానర్‌లో ప్రచురించకపోవడంపై సభికులు బహిరంగగానే చర్చించుకున్నారు.


