కలెక్టర్ ప్రావీణ్య
కంది(సంగారెడ్డి): మహిళా సంఘాల ద్వారా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయిస్తామని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కందిలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డితో కలసి ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికీ చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యం, ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖ ద్వారా సమావేశాలు నిర్వహించి చట్టాలు, ప్రజలకు బాల బాలికల సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈజీఎస్ పథకం ద్వారా మంజూరైన నిధులతో పాఠశాలల్లో మరుగుదొడ్లు ప్రహరీ గోడలు నిర్మించేందుకు సర్పంచులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయం: నిర్మలారెడ్డి
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని నిర్మలారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం సాగు కోసం రైతు భరోసా, రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు ఇస్తుందన్నారు. పంట మార్పిడి చేయడం వల్ల భూసారం పెరిగి రైతులకు అధిక ఆదాయం వచ్చే అవకాశముందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ రవికుమార్, ఎంపీఓ మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి ఆంజనేయులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


