పటాన్‌చెరు: పటాన్‌చెరులోని జెడ్పీహెచ్‌ఎస్ వివాదాస్పద భూమిలో ఆక్రమణలు తొలగించాలని, పాఠశాలను పునరుద్ధరించాలని కోరుతూ పూర్వ విద్యార్థులు, మేధావులు బుధవారం రోడ్డెక్కారు. పాఠశాలలో చదివిన స్థానిక రాజకీయ వేత్తలు, మీడియా ప్రతినిధులు, వివిధ హోదాల్లో పని చేస్తున్న వారందరూ తరలి వచ్చారు. పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ, పటాన్‌చెరు పాఠశాల పూర్వ విద్యార్థుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర సహ అధ్యక్షుడు అశోక్ కుమార్, జిల్లా అధ్యక్షుడు సోమ శేఖర్, మాజీ శాసన సభ్యులు సత్యనారాయణ, బీజేపీ నాయకురాలు గోదావరి, కాంగ్రెస్ నగర అధ్యక్షులు నరసింహారెడ్డి, పూర్వ విద్యార్థులు బైండ్ల కుమార్, శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాల గదులను రాత్రి పూట కూల్చివేయడాన్ని తప్పు బట్టారు. వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాల స్థలానికి ఇలాంటి దుస్థితి రావడం శోచనీయమని పేర్కొన్నారు. విశాలమైన భవనాన్ని అవసాన దశకు చేర్చి కబ్జాదారులకు ఆ ప్రాంతాన్ని అప్పజెప్పే కుట్ర సాగిందన్నారు. సుప్రీం కోర్టు అనుమతితో నిర్మించిన ప్రహరీ గోడను రాత్రికి రాత్రి కూల్చివేయడం దారుణమన్నారు. కాంపౌండ్ వాల్ కూలుస్తుంటే పాత భవనం నేలమట్టమైందని తప్పుడు నివేదిక ఇవ్వడం ఆక్షేపణీయమని అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం సుప్రీం కోర్టులో సమర్థుడైన లాయర్‌ను నియమించి ఆ స్థలాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ, పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీ


