అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్
కొండపాక(గజ్వేల్): గ్రామాల్లో మత్తు పదార్థాలను నివారించేందుకు సర్పంచ్‌లు కృషి చేయాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. కొండపాకలోని మండల పరిషత్ కార్యాలయ ఐఓసీ భవనంలో బుధవారం 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిధులు వినియోగించడం వల్ల గ్రామాలు అభివృద్ధి దిశలో పయనిస్తాయన్నారు. గ్రామాల్లో సమస్య తీవ్రత మేరకు పనులు చేపట్టాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో మత్తు పదార్థాల అమ్మకాలు, వినియోగాలు పెరిగిపోతుండటంతో యువత పెడదారిన పడుతున్నారన్న విషయాన్ని దృష్టి పెట్టుకోవాలన్నారు. గ్రామాభివృద్ధి కోసం ప్రతీ ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలన్నారు. అంతకు ముందు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రజా ప్రతినిధులతో చర్చించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ మల్లికార్జున్, సర్పంచ్‌లు శివకుమార్, గంగాధర్, వెంకట్‌గౌడ్, ముత్యాల యాదవ్వ, బాలరాజు,కరుణాకర్‌రెడ్డి,మానస, పంచాయితీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


