● జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సందన్న ● సిద్దిపేటలో మాక్ డ్రిల్‌తో అవగాహన
సిద్దిపేటకమాన్: వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని, ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్ని మాపక శాఖ అధికారి సందన్న తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్, ఆర్టీసీ డిపో వద్ద అగ్నిమాపక సిబ్బంది బుధవా రం మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు సిబ్బంది స్పందించే తీరు, నీరు ద్వారా ప్రమాదాలను నివారించడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిలో నిప్పు రవ్వలను తేలికగా తీసుకోకూడదని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముందు జాగ్రత్తలతో అగ్ని ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. ఏదైనా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. ఆర్టీసీ బస్టాండ్‌లలో ప్రయాణికులు, ప్రజలకు అవగాహన కల్పించి పోస్టర్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో సిద్దిపేట అగ్నిమాపక స్టేషన్ ఇన్‌చార్జి అధికారి సికిందర్, సిబ్బంది రాజేష్, తదితరులు పాల్గొన్నారు.


