● సకాలంలో చికిత్స అందించాలి ● సిద్దిపేట ప్రభుత్వాసుపత్రి వైద్యులు
సిద్దిపేటకమాన్: చిన్న పిల్లల్లో గుండె సమస్యలను ముందుగా గుర్తించి చికిత్స అందించడం వల్ల పరిష్కరించవచ్చని సిద్దిపేట ప్రభుత్వాసుపత్రి చిన్నపిల్లల విభాగ వైద్యులు సురేశ్‌బాబు, మనోహార్ తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పిడియాట్రిక్ విభాగం ఆధ్వర్యంలో చిన్నపిల్లల్లో గుండె సమస్యలు, చికిత్స విధానం (పిడియాట్రిక్ కార్డియాలజీ సీపీఓ) అనే అంశంపై బుధవారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హైదరాబాద్ రెయిన్‌బో ఆస్పత్రి నుంచి సీనియర్ కార్డియాలజిస్టు వైద్యులు శ్వేతబక్రు, ఫణిభార్గవి, గణపతి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..చిన్న పిల్లల్లో ఏమైనా గుండె సమస్యలు ఉంటే ముందుగా పలు రకాల పరీక్షల ద్వారా గుర్తించడం, అధునాతన చికిత్స విధానాలపై వివరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ సంగీత, ఇంచార్జీ సూపరింటిండెంట్ డాక్టర్ చందర్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్, పిడియాట్రిక్ విభాగ వైద్యులు డాక్టర్ టి.సి మనోహార్, వైద్యులు పాల్గొన్నారు.


