తయారీపై రైతులకు శిక్షణ
తొగుట(దుబ్బాక): ఘన జీవామృతంతో పాటు ఎకరానికి మరో 200 కిలోల ఎరువు వేసుకోవడం మూలంగా భూమిలో సూక్ష్మజీవులు సంఖ్య వృద్ధి చెంది భూమి సారవంతంగా తయారవుతుందని ఏఈవో నాగార్జున అన్నారు. బుధవారం మండలలోని బండారుపల్లిలో ఘన జీవామృతం తయారు చేసే విధానంపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ రైతు గునుగంటి రాజిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఘన జీవామృతాన్ని రైతులతో తయారు చేయించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. పశువుల పేడ 100 కిలోలు, పశువుల మూత్రం 5లీటర్లు, ద్విదళ పప్పుల పిండి 2కేజీలు, బెల్లం 2కేజీలు, పిడికెడు పుట్టమన్ను లేదా రసాయనాలు తగలని పొలం గట్టు మన్ను కలిపి ఘన జీవామృతం తయారు చేస్తున్నామని వివరించారు. వానాకాలం కోసం ఘన జీవామృతాన్ని రైతులు వేసవిలో తయారు చేసుకుంటే వాతావరణం అనుకూలంగా ఉంటుందన్నారు. దీనిని ఎకరానికి దుక్కిలో కనీసం 400 కిలోలు వేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటస్వామిగౌడ్, రైతులు పాల్గొన్నారు.


