● ఘనంగా జయంతి వేడుకలు
● ర్యాలీలు, రన్, అన్నదాన కార్యక్రమాలు
● నూతన విగ్రహాల ఆవిష్కరణ
● పాల్గొన్న ప్రముఖులు
సంగారెడ్డి: అంబేడ్కర్ అందరివాడని పలువురు వక్తలు పేర్కొన్నారు. మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతిని జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఉదయం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో అంబేడ్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో రన్ ఫర్ అంబేడ్కర్ కార్యక్రమాన్ని నిర్వహించి స్థానిక ఐబీ నుంచి పాత బస్టాండ్ వరకు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ వనిత, అదనపు కలెక్టర్ పాండు తదితరులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా సంగారెడ్డి మండలం నాగపూర్‌లో అంబేడ్కర్ నూతన విగ్రహాన్ని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆవిష్కరించారు. పట్టణంలోని యువజన సంఘాలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో రన్‌లు, ర్యాలీలు, మహా ప్రదర్శనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో యువత నడిచి, రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టాలని సూచించారు.


