ఆర్టిజన్‌ల సమ్మెతో విద్యుత్ సమస్యలు ఉత్పన్నం
పనిచేయని ట్రాన్స్‌ఫార్మర్లు ● ఆందోళనలో రైతులు
మెదక్‌జోన్: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌శాఖలో ఆర్టిజన్‌లుగా 1,570 మంది పనిచేస్తున్నారు. వీరంతా రెగ్యులర్ రైజ్ కోసం వారం రోజులుగా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో విద్యుత్ సరఫరాలో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా వినియోగదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక రెగ్యులర్ లైన్‌మెన్‌లు, ఇతర ఉద్యోగులు ఉన్నప్పటికీ ఆర్టిజన్‌లు లేక విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినా, లైన్లు తెగిపోయినా, ఇళ్లకు విద్యుత్ నిలిచిపోయినా పరిష్కారం కాదడం లేదని ప్రజలు, రైతులు ఆవేదన చెందుతున్నారు.
రెగ్యులర్ చేయాలని..
గతంలో సబ్‌స్టేషన్ల నిర్వహణను కాంట్రాక్టర్స్‌కు అప్పగించేవారు. వారు సబ్ స్టేషన్ల ఆపరేటర్లుగా ఐటీఐ, డిప్లమా, బీటెక్ లాంటి విద్యార్హతలు గల వారిని ఆపరేటర్లుగా నియమించుకొని కొనసాగించారు. కాగా అప్పట్లో 2 నుంచి 3 నెలలకోసారి వారికి గుత్తేదారు జీతాలు చెల్లించేవారు. అది కూడా వేతనంలో కొంత కోతపెట్టి ఇచ్చేవారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని నియమించి స్తంభాలు ఎక్కించటం, బిల్లుల వసూళ్లు, విద్యుత్ సమస్యలు వస్తే వారితేనే చేయించేవారు. కాగా బీఆర్‌ఎస్ హయాంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహించే వారిలో కొంత మందిని విద్యుత్‌శాఖలో విలీనం చేస్తూ ‘ఆర్టిజన్‌లు’గా తీసుకున్నారు. దీంతో వారి సీనియార్టీని బట్టి రూ. 15 వేల నుంచి రూ. 30 వేల వేతనం చెల్లిస్తున్నారు. కానీ వీరిని నేటికీ రెగ్యులర్ చేయలేదు. దీంతో తమను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి, అన్నిరకాల బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రధాన డిమాండ్స్..
ఆర్టిజన్‌లకు వారి విద్యార్హతలను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి
ప్రస్తుతం ఉన్న ఓఅండ్‌ఎం సర్వీస్ రూల్స్ అమలు చేయాలి
టీజీఎస్‌సీడీసీఎల్‌లో పనిచేసే ఆన్‌మన్ వర్కర్లను ఆర్టీజన్‌లుగా గుర్తించాలి
విద్యుత్ సంస్థలో 2016 డిసెంబర్ కంటే ముందు అన్ని అర్హతలుండి పనిచేస్తూ ఇప్పటికీ ఔట్‌సోర్సింగ్ అండ్ కాంట్రాక్టు కార్మికులుగా కొనసాగుతున్న వారిని ఆర్టిజన్‌లుగా గుర్తించాలి.
2026 వేతనం అండ్ పీఆర్‌సీ వెంటనే అమలు చేయాలి
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు పోతరాజు పోచయ్య. ఈయనది చిన్నశంకరంపేట మండలం చందాపూర్ గ్రామం. ఇతనితో పాటు మరో ముగ్గురు రైతులు కలిసి గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసుకోగా.. దాని ద్వారా నాలుగు బోర్లు నడుస్తున్నాయి. వాటి పరిధిలో 20 ఎకరాల్లో నాట్లు వేశారు. వారం క్రితం గాలిదుమారం రావడంతో ట్రాన్స్‌ఫార్మర్‌కు సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం ఆర్టిజన్‌లు సమ్మె చేయటంతో బాగు చేసేందుకు ఎవరు ముందుకు రావటం లేదు. వరి పంటకు మరో తడి నీరు పెడితే దిగుబడి వస్తుందని, కరెంటోళ్లకు ఫోన్ చేస్తే ఎవరూ స్పందించటం లేదు. ఇది ఒక్క పోచయ్య సమస్యే కాదు. ఉమ్మడి జిల్లాలో వేలాది మంది రైతులతో పాటు విద్యుత్ వినియోగదారుల పరిస్థితి.
హామీ నిలబెట్టుకోవాలి
కాంగ్రెస్ నేతలు అధికారంలోకి రాగానే విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్‌లను రెగ్యులరైజ్ చేసి వారి విద్యార్హతలను బట్టి ఉద్యోగాల్లో నియమిస్తామన్నారు. అధికారంలోకి వచ్చి నేటికీ రెండున్నరేళ్లు అవుతున్నా సమస్యలను పట్టించుకోలేదు. రెగ్యులర్ చేయకపోతే సమ్మెను ఉధృతం చేస్తాం.
– బీఎన్ స్వామి,
ఉమ్మడి జిల్లా ఆర్టిజన్‌ల సంఘం అధ్యక్షుడు


