పటాన్‌చెరు టౌన్: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజు వివరాల ప్రకారం... బీహార్‌కు చెందిన సురేశ్‌రాయ్ ఇంద్రేశం మున్సిపాలిటీ రామేశ్వరంబండ లో డెయిరీ ఫాం నిర్వహిస్తున్నాడు. ఇతర రాష్ట్రాల్లో ఎండు గంజాయిని కొనుగోలు చేసి, మూడు నెలలుగా పటాన్‌చెరులో విక్రయిస్తున్నాడు. కాగా ఒడిశాలోని మల్కనగిరి అటవీ ప్రాంతంలో గుర్తు తెలి యని వ్యక్తుల నుంచి కిలో గంజాయిని కొనుగోలు చేసి, ఆర్టీసీ బస్సులో పటాన్‌చెరుకు తిరిగొచ్చాడు. వచ్చే దారిలో దాదాపు 200 గ్రాముల గంజాయిని అమ్మి, ఆ వచ్చిన డబ్బును ప్రయాణ ఖర్చుల కోసం వాడుకున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం సాయంత్రం రామేశ్వరం డెయిరీ ఫాం వద్ద పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 798 గ్రాముల గంజాయి, సెల్‌ఫోన్‌ను సీజ్ చేసి నిందితున్ని రిమాండ్‌కు తరలించారు.


