పట్టణంలోని రాంనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ప్రమాదం పొంచి ఉంది. బ్రిడ్జి సైడ్ వాల్ గ్రిల్స్ దెబ్బతిని ఊడి కిందపడుతున్నాయి. వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి గుండా ప్రయాణించడానికి ప్రజలు భయపడుతున్నారు. సైడ్‌వాల్ గోడలు ఊడిపడి రోడ్డు సైతం దెబ్బతిని గుంతలుపడి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్రమాదాలు జరగక ముందే స్పందించాలని అధికారులను ప్రజలు కోరుతున్నా.. పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
–జహీరాబాద్ టౌన్
జహీరాబాద్ నుంచి తాండూర్ రహదారిలో పట్టణంలోని బాగారెడ్డి పల్లి ప్రాంతంలో సుమారు 25 సంవత్సరాల క్రితం ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. బ్రిడ్జి కారణంగా రాంనగర్, హోతి(కె), మల్‌చెల్మ, శేకాపూర్‌తో పాటు తాండూర్ తదితర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది. రెండున్నర దశాబ్దాలు దాటడంతో బ్రిడ్జి దెబ్బతింది. బ్రిడ్జికి ఇరువైపులా సైడ్ వాల్ గ్రిల్స్(గోడలు) దెబ్బతిని పెచ్చులూడి కిందపడుతున్నాయి. బ్రిడ్జి కింద ఉన్న నివాస ప్రాంతాల్లో పడటం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు..
గత సంవత్సరం ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి సైడ్ గ్రిల్స్‌పైకి దూసుకొచ్చింది. అదృష్టవశాత్తు కింద పడకుండా మధ్యలోనే ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సైడ్‌వాల్ గ్రిల్స్(పిట్టగోడ) కూలిపోవడంతో కాలినడకన వెళే పిల్లలు, వృద్ధులు, పాదచారులు కిందపడే అవకాశాలున్నాయి. కొంత మంది యువకులు ప్రమాదాల నివారణకు సైడ్‌వాల్ గోడలు కూలిన ప్రాంతంలో కర్రలను అడ్డంగా కట్టారు.
రాంనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకొని ప్రమాదం పొంచి ఉన్నా.. సంబంధింత శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిడ్జి సైడ్ వాల్ గోడలు దెబ్బతిని నెలలు గడుస్తున్న అధికారులు స్పందించడం లేదు. రోడ్డు మధ్యలో పడిన గుంతలను కూడా పూడ్చడం లేదు. బ్రిడ్జికి ఇరుపక్కల గల స్ట్రీట్ లైట్లు కూడా సరిగా వెలగడం లేదు. రాత్రి ఫూట అంథకారం నెలకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. చినుకుపడితే చాలు బాగారెడ్డి విగ్రహం వద్ద మోకాలి వరకు నీరు నిలుస్తుంది. దీంతో బ్రిడ్జి పైనుంచి ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్నారు.


