● తనవారినే అద్దెకు దించి డ్రామాలు ● ఖాళీ చేసేందుకు సమయం ఇచ్చిన హైడ్రా ● ‘అమీన్‌పూర్ కూల్చివేత’లపై అధికారుల వివరణ
సాక్షి, సిటీబ్యూరో: అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో ఎంఏ ముఖీం న్యాయవాది ముసుగులో సాగిస్తున్న ఆక్రమణలకు హైడ్రా చెక్ పెట్టిందని అధికారులు మంగళవారం వివరణ ఇచ్చారు. అతడి సోదరుడు ఎంఏ అజీం దుబాయ్‌లో ఉంటున్నారని, షోకాజ్ నోటీసులు, స్పీకింగ్ ఆర్డర్లు పట్టించుకోకుండా తన అనుచరగణంతో కలిసి అనుమతులు తీసుకుకోకుండానే ప్రభుత్వ భూమిలో ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. వివరాలు ఇలా... ఐలాపూర్‌లో అజీం ఇప్పటికే నాలుగు అపార్టుమెంట్లు నిర్మించి విక్రయించారు. శనివారం తొలగించిన భవనం నిర్మాణ దశలోనే హైడ్రా హెచ్చరించింది. దానికి ఎలాంటి అనుమతులు లేవని గత ఏడాది జూన్ 25న షోకాజ్ నోటీసు ఇచ్చింది. గతంలో గ్రామపంచాయతీ అనుమతులు ఇచ్చిందని.. కిష్టారెడ్డిపేటలోకి తన భవనం వస్తుందని అజీం వివరణ ఇచ్చారు. హైడ్రా విచారించగా పంచాయతీ, తర్వాత ఏర్పడిన మున్సిపాలిటీలోనూ అనుమతులు తీసుకున్నట్టు ఆధారాలు లభించలేదు. దీంతో గత ఏడాది జులై 3న హైడ్రా స్పీకింగ్ ఆర్డర్ జారీ చేసింది. అజీం కడుతున్న భవనానికి ఎలాంటి అనుమతులు లేనందున తొలగించాలని సూచిస్తూ, పక్షం రోజుల గడువు ఇచ్చింది. అయినప్పటికీ భవన నిర్మాణాన్ని అజీం పూర్తి చేశారు. హైడ్రా నోటీసుల నేపథ్యంలో ఆ భవనంలోని 45 ఫ్లాట్లలో ఏ ఒక్కటినీ కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తన అనుచరులతో పాటు ఈ విషయాలు తెలియని అమాయకులకు 20 ఫ్లాట్లు విక్రయించారు. నివాసాల జోలికి హైడ్రా వెళ్లదనే ఉద్దేశంతో వీరందరినీ అన్ని అంతస్తుల్లో ఉన్నట్టు చూపించారు. దీంతో హైడ్రా అద్దెకు ఉన్న వారిని ఖాళీ చేయించాలని సూచిస్తూ భవన యజమానికి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు అందుకున్న అజీం ఖాళీగా ఉన్న ఫ్లాట్లలో మరికొంతమంది అనుచరులను దించే పనిలో నిమగ్నమయ్యాడే తప్ప అందులో ఉన్నవారిని ఖాళీ చేయించలేదు. దీంతో గత నెల 11న అమీన్‌పూర్‌లో రెవెన్యూ, మున్సిపల్, పోలీసు శాఖలతో కలిసి హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ఐలాపూర్‌లోని 1263 ఎకరాల భూమి స్వరూపం మారకూడదని హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ ముఖీం గెస్ట్‌హౌస్‌తో పాటు 40 ఎకరాల్లో ఫామ్‌హౌస్ నిర్మించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వాటిని తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ముఖీం సోదరుడు నిర్మించిన ఆరు అంతస్తుల భవనాన్ని తొలగించే పనిని హైడ్రా శనివారం చేపట్టింది. అందులో ఉంటున్న వారికి డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహకరిస్తూ వారి సామాన్లు భద్రంగా కిందకు దించారు. అందులో ఉన్న కొద్దిమందిని ఖాళీ చేయించడానికి, తరలించడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకూ హైడ్రా సమయం ఇచ్చింది.


