● ఎండవేడిమికి ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు ● బెంచీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేయని అధికారులు
నర్సాపూర్: నర్సాపూర్ ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికులకు కనీస వసతులు కరువయ్యాయి. స్థానిక బస్టాండులో ఆర్టీసీ అధికారుల ఏర్పాట్లను గమనిస్తే ప్రయాణికుల పట్ల వివక్ష చూపుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక బస్టాండు నుంచి హైదరాబాద్, సంగారెడ్డి, గజ్వేల్ మార్గాల నుంచి వచ్చి అటు వైపు వెళ్లే బస్సులు బస్టాండు శాశ్వత భవనంలోని ప్లాట్ ఫాం వైపు వచ్చి వెళ్తుంటాయి. శాశ్వత బస్టాండులో అధికారులు ప్రయాణికులు కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేయడంతో పాటు ఫ్యాన్లు అమర్చారు. కాగా శాశ్వత బస్టాండుకు ఎదురుగా ఉన్న షెడ్డుతోపాటు ప్లాట్‌ఫాం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పటాన్‌చెరుతో పాటు నియోజకవర్గంలోని వెల్దుర్తి, మానెపల్లి, రత్నాపూర్, ఎల్లమ్మగూడ, గోమారం, వెంకటాపూర్ తదితర గ్రామాల బస్సులు వచ్చి వెళ్తుంటాయి. కాగా తాత్కాలిక షెడ్డులో ప్రయాణికులు కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేయకపోవడంతో వారు ఫ్లోరింగ్‌పై కూర్చుని బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. కాగా ప్రస్తుతం వేసవి సీజన్ కావడంతో మధ్యాహ్నం ఫూట షెడ్డు కింద కూర్చోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఎండకు రేకుల షెడ్డు వేడెక్కడంతో షెడ్డు కింద చాలా వేడిగా ఉంటుందని, షెడ్డు లోపలికి సైతం ఎండ వస్తుందని వాపోతున్నారు. ఫ్లోరింగ్ సైతం వేడెక్కడంతో కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంటుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షెడ్డులో ఫ్యాన్లు సైతం ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. వేసవిని దృష్టిలో పెట్టుకొని తాత్కాలిక షెడ్డు వద్ద కనీస వసతులు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.


