సిద్దిపేటఅర్బన్: పీడిత వర్గాల అభ్యున్నతికి బీఆర్ అంబేడ్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్ అంబేడ్కర్, జగ్జీవన్‌రాం విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. అంబేడ్కర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికి కేబినెట్ ర్యాంకు పదవి, రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న తనకు ఆహ్వానం పంపించలేదని, కరపత్రంలో పేరు కూడా పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాలు సైతం పంపుతున్నారని, కానీ సిద్దిపేట కలెక్టర్ మాత్రం ఆహ్వానించకుండా తనను అవమానిస్తున్నారని తెలిపారు. తనను మాత్రమే కాదు.. కోటి మంది దళితులను అవమానించినట్టేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడా మాజీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రాజయ్య, ఉప సర్పంచ్ కిష్టయ్య, వెంకట్, శ్రీనివాస్, ఎల్లేశ్, తిరుపతి, గుండెల్లి శ్రీనివాస్, రాజయ్య, కుమారస్వామి, అశోక్, బాబు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


