కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
సిద్దిపేటఅర్బన్: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని కలెక్టర్ హైమావతి వంట సిబ్బందిని, ఉపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని మిట్టపల్లి– ఎల్లుపల్లి శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వంట గదిలో అన్నం, పెరుగు, గుడ్డు, పప్పు, పప్పుచారు మాత్రమే వండారని, మిగతా కూరలు లేవా అని అడిగారు. ఇందుకు కూరగాయలు ఆలస్యంగా రావడంతో వంట ఆలస్యమైందని సిబ్బంది తెలిపారు. త్వరగా పూర్తయ్యే కూరగాయలు వండి విద్యార్థులకు వడ్డించాలని సూచించారు. వంట వండే వరకు అక్కడే కాసేపు విద్యార్థులతో మాట్లాడి పాఠశాల పరిసరాలను పరిశీలించారు. రోజు మెనూ తప్పనిసరిగా పాటించాలని చేసిన వంటలు నాణ్యతగా, రుచికరంగా వండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించమని వంట సిబ్బందిని, ఉపాధ్యాయులను హెచ్చరించారు.


