సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో రేషన్‌షాపుల్లో బియ్యం నిల్వలు తరచూ నిండుకుంటున్నాయి. ఒక్కో కార్డుదారునికి ఇచ్చే బియ్యం మూడు రెట్లు పెరగడంతో స్టాక్ వచ్చిన రెండు, మూడు రోజుల్లోనే నిల్వలు అడుగంటుతున్నాయి. రేషన్‌షాపులకు బియ్యాన్ని సరఫరా చేసే ఎంఎల్‌ఎస్ పాయింట్లలోనూ నిల్వలు లేకుండా పోయాయి. దీంతో పౌరసరఫరాల సంస్థ అధికారులు ఎప్పటికప్పుడు స్టాక్ తెప్పించడంలో తలమునకలయ్యారు. జిల్లాలో ఈ సన్నబియ్యం నిల్వలు లేకపోవడంతో పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి సన్నబియ్యాన్ని సర్దుబాటు చేస్తున్నారు. ఈ క్రమంలో లారీల రాకకు సమయం పడుతుండటంతో పంపిణీలో కాస్త ఆలస్యమవుతోంది. దీనికితోడు ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తుండటంతో గతంలో ఈ బియ్యాన్ని తీసుకునే కార్డుదారులు గణనీయంగా పెరిగారు.
మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో బియ్యం తీసుకునేందుకు గడువు పొడిగించారు. సాధారణంగా ప్రతీనెల 20 తేదీలోపు బియ్యం తీసుకునేందుకు వీలుంటుంది. అయితే ఈ గడవును నెలాఖరు వరకు పొడిగించారు. అయితే జిల్లాలోని పలు పారిశ్రామిక వాడల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఎక్కువగా ఉంటారు. యూపీ, బీహార్, ఒడిశా వంటి రాష్ట్రాలకు చెందిన కార్మిక కుటుంబాలు ఇక్కడే నివాసముంటాయి. రేషన్ పోర్టబిలిటీ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక ఈ కార్మికులంతా ఇక్కడే బియ్యాన్ని తీసుంటున్నారు. దీంతో ఇతర జిల్లాలతో పోల్చితే సంగారెడ్డి జిల్లాకు కేటాయింపు ఎక్కువగా ఉంటోంది. మరోవైపు జిల్లాలో సన్నధాన్యం సాగు అతిస్వల్పంగా ఉంటుంది. దీంతో జిల్లాలోని రేషన్‌షాపులకు అవసరమైన సన్న బియ్యం ఇతర జిల్లాల నుంచే రావాల్సి ఉంటుంది.
4.45 లక్షల రేషన్ కార్డులు..
జిల్లాలో మొత్తం 4.45 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. ప్రతీనెల సుమారు ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అయితే మూడు నెలల కోటా అంటే సుమారు 24 వేల మెట్రిక్ టన్నులు పంపిణీ చేయాల్సి ఉంది. అత్యధికంగా పటాన్‌చెరు, జహీరాబాద్ ఎంఎల్‌ఎస్ పాయింట్ల ద్వారా ఎక్కువగా సన్నబియ్యం సరఫరా అవుతోంది. కాగా ఈనెల మొదటి వారం రోజుల పాటు రేషన్‌షాపుల వద్ద భారీ లైన్లు దర్శనమిచ్చాయి. బియ్యాన్ని తీసుకునేందుకు ఒక్కసారిగా కార్డుదారులు రేషన్‌షాపుల వద్దకు రావడంతో ఈ షాపులన్నీ కిటకిటలాడాయి. ఒక్కో కార్డు దారుడు మూడుసార్లు వేలిముద్రలు వేయాల్సి ఉండటంతో రేషన్ పంపిణీలో కాస్త ఆలస్యమవుతోంది. దీంతో క్యూలో కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు.
మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంతో..
పెద్దపల్లి, కామారెడ్డి, నిజామాబాద్
జిల్లాల నుంచి బియ్యం సర్దుబాటు
మూడు మాసాల కోటాకు
24 వేల మెట్రిక్ టన్నులు అవసరం


