హాస్టల్‌ గదులు విశాలంగా నిర్మించాలి | - | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ గదులు విశాలంగా నిర్మించాలి

Apr 14 2026 9:04 AM | Updated on Apr 14 2026 9:04 AM

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి

సంగారెడ్డి: నియోజక వర్గంలో విద్యార్థులకు నిర్మిస్తున్న హాస్టల్‌ భవనాల గదులు విశాలంగా నిర్మించాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల కోసం నూతనంగా హాస్టల్‌ భవనాలు, అదనపు గదుల నిర్మాణపై సోమవారం జగ్గారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ పాండు, బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ జగదీశ్‌ తదితరులతో కలిసి వెలుగు ఆఫీసు ప్రాంగణానికి వెళ్లి నిర్మాణంలో ఉన్న బీసీ బాలికల హాస్టల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా బాలికలు బస చేసే గదులతోపాటు టాయిలెట్స్‌, డైనింగ్‌ హాల్‌, కిచెన్‌, భవన ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ...వెలుగు కార్యాలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న బీసీ గర్‌ల్స్‌ హాస్టల్‌ భవనం తరహాలో సంగారెడ్డి నియోజకవర్గంలో మిగతా హాస్టళ్లూ నిర్మించాలన్నారు. అవసరమైన నిధులను తాను ప్రభుత్వం నుంచి మంజూరు చేయిస్తానని అధికారులకు భరోసా ఇచ్చారు. నిధుల విషయాన్ని త్వరలోనే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, బీసీ సంక్షేమ విభాగం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని అధికారులకు వివరించారు.

జాతరకు ర్యాకల్‌ ఎల్లమ్మ

ఆలయం ముస్తాబు

నారాయణఖేడ్‌: ఖేడ్‌ మండలంలోని ర్యాకల్‌ ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఈనెల 15వ తేదీ నుంచి వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ర్యాకల్‌ ఎల్లమ్మకు మొక్కులు తీర్చుకుంటే వివిధ వ్యాధుల బారిన పడ్డ చిన్నారులు కుదుట పడతారని ప్రతీతి ఉండటతో ఈ జాతరకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తారు. ఈనెల 15న బోనాల ఊరేగిం పు, ఈనెల 16న బండ్ల ప్రదర్శన, 17న పాచిబండ్ల ప్రదర్శన, నిండు జాతర, 18న కుస్తీ పోటీలు, 19న చివరి పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేపడుతున్నట్లు వారు తెలిపారు.

పీఆర్సీ అమలు చేయాలి

టీఎస్‌ యూటీఎఫ్‌ డిమాండ్‌

నారాయణఖేడ్‌: ఉపాధ్యాయులకు పెండిగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే ప్రకటించి పీఆర్సీ నివేదికను తెప్పించుకుని 50% ఫిట్‌మెంట్‌ను 2023 జూలై 1 నుంచి అమలుచేయాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు కాశీనాథ్‌ జాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఖేడ్‌లో సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సంఘం ఉద్యమ పతాకాన్ని సీనియర్‌ నాయకులు సంగయ్య ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..విద్యారంగ అభివృద్ధికి సంఘం ఇతోధికంగా పాటుపడాలన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం చేసిన పోరాటాలు, సాధించిన విజయాలను గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా, డివిజన్‌ బాధ్యులు ఏశప్ప, నరేశ్‌, నర్సయ్య, హరిసింగ్‌, జ్యోతిలింగం, ఏసుదాస్‌, శ్రీరామ్‌, మండలాల బాధ్యులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ టీచర్‌పై దాడి చేసిన వారికి బెయిల్‌

కంగ్టి(నారాయణఖేడ్‌): అంగన్‌వాడీ టీచర్‌పై దౌర్జన్యానికి పాల్పడిన నిందితులకు కోర్డులో ఊరట లభించింది. మండలంలోని రాసోల్‌ గ్రామంలో ఇటీవల అంగన్‌వాడీ టీచర్‌ పి.వసంతకుమారి(61)దాడి చేసిన కేసులో నిందితులు అవుటి సాయవ్వ, చాకలి బాలమణి, వైద్యనాథ్‌, బండెప్ప, రాములుకు సోమవారం ఖేడ్‌ మున్సిపల్‌ మేజిస్ట్రేట్‌ బెయిల్‌ మంజూరు చేసినట్లు ఎస్‌ఐ దుర్గారెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement