సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని ఆరూర్‌లో సదాశివపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను పాటించి,హెల్మెట్, సీట్ బెల్ట్‌ను తప్పనిసరిగా ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సూచించారు. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని చెప్పారు. ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డుసైన్‌లను తప్పనిసరిగా పాటించాలన్నారు. జీబ్రా క్రాసింగ్ వద్ద పాదాచారులకు ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతేనే హారన్‌ను వాడాలన్నారు.
రోడ్డు ప్రమాదాలు అరికట్టాలి
పటాన్ చెరు టౌన్: రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాలని డీఎస్పీ ప్రభాకర్ కోరారు. సోమవారం భానూర్, నందిగామ గ్రామాల్లో బీడీఎల్ సీఐ విజయ్‌కృష్ణ ఆధ్వర్యంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ‘అరైవ్–అలైవ్’అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భానూర్ గ్రామంలో యముడి వేషంలో ఉన్న నటుడితో రోడ్డుపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు రోడ్డు ప్రమాదాలు, వాటి నష్టాలు తెలియజేశారు. హెల్మెట్ లేని వారికి గులాబీ పూలు ఇచ్చి ఇకమీదట హెల్మెట్ ధరిస్తామని హామీ తీసుకున్నారు. గ్రామ ప్రజలతో ప్రతిజ్ఞ కూడా చేయించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. అనారోగ్యాలతో మరణించేవారికంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారన్నారు. సీఐ విజయ్‌కృష్ణ మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు గ్రామాల్లో కమిటీలు సహకరిస్తాయన్నారు.
ఎస్పీ పరితోశ్ పంకజ్


