రేషన్‌కార్డులపై పిడుగు | - | Sakshi
Sakshi News home page

రేషన్‌కార్డులపై పిడుగు

Apr 14 2026 8:58 AM | Updated on Apr 14 2026 8:58 AM

ప్రభుత్వానికి ఆదాయపు పన్ను కడుతున్నారా? అయితే మీ తెల్ల రేషన్‌ కార్డును తొలగించనున్నారు. ఆదాయపు పన్ను శాఖ నుంచి పన్ను చెల్లించే వినియోగదారుల జాబితాను తహసీల్దార్‌ కార్యాలయానికి పంపించి వివరాలు సేకరించే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. జాబితాలను రేషన్‌ డీలర్ల వారీగా అధికారులు పంపించారు. పన్ను చెల్లించే వినియోగదారుల రేషన్‌ కార్డులను తొలగించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. – హుస్నాబాద్‌
ఆదాయపు పన్ను చెల్లిస్తే.. రేషన్‌ కార్డు రద్దు

రేషన్‌ దుకాణంలో బియ్యం తీసుకుంటున్న లబ్ధిదారులు

హుస్నాబాద్‌ పట్టణంలో 8 రేషన్‌ దుకాణాలున్నాయి. రేషన్‌ డీలర్ల నుంచి ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్లు జాబితాలో ఉన్న వారికి సమాచారం అందించారు. దారిద్య్రరేఖకు దిగువనున్న వారికే తెల్ల రేషన్‌ కార్డులు ఇవ్వాలని, ఆదాయపు పన్ను చెల్లించే వారికి, కార్లు ఉన్నవారి కార్డులను తొలగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సాధ్యమైనంత వరకు రేషన్‌ కార్డుల్లో కోత విధించి అర్హులైన వారికే తెల్ల రేషన్‌ కార్డులు ఇవ్వాలని అందుకు తగ్గట్లుగా ఏరివేత ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.

కార్డుతో ఎన్నో ప్రయోజనాలు

ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకం పొందాలన్నా, ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావాలన్నా తెల్ల రేషన్‌ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. చివరకు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచిత కార్పోరేట్‌ వైద్యం పొందాలన్న తెల్ల రేషన్‌ కార్డు తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో చిరు వ్యాపారం కోసం బ్యాంకులో రుణం పొందేందుకు చిన్న మొత్తంలో ఐటీ రిటర్న్‌ చూపించే పేదవారిని, లక్షలు, కోట్ల రూపాయల టర్నోవర్‌ ఉన్న బడా వ్యాపారులతో జత కట్టడం సరికాదు. చాలా మంది రేషన్‌ బియ్యం తీసుకోకున్నా తెలుపు రేషన్‌ కార్డు ద్వారా పొందే ప్రయోజనాలను పొందుతున్నారు. అలాంటి వారిని గుర్తించి కార్డులను తొలగించాలే కానీ చిన్న అవసరాలకు ఐటీ చెల్లించే నిరుపేదల కార్డులను తొలగించడం సమంజసం కాదని పలువురు వాపోతున్నారు.

పట్టణంలో ప్రభుత్వానికి ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారిలో 380 మంది ఉన్నట్లు అధికారులు జాబితాలో పేర్కొన్నారు. జాబితాలో ఉన్న వినియోగదారులకు కొందరు రేషన్‌ డీలర్లు ఫోన్లు చేసి ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా? అని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరికొంత మంది డీలర్లు ఐటీ రిటర్న్స్‌ చెల్లించే వారి వివరాలు సేకరించడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఎక్కడైనా రేషన్‌ బియ్యం తీసుకొనే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. దీంతో జీవనోపాధి కోసం హైదరాబాద్‌ లాంటి నగరాల్లో ఉంటున్న వినియోగదారుల అడ్రస్‌ తమకు ఎలా తెలుస్తోందని డీలర్లు మిన్నకుండి పోతున్నారు. చిన్న చిన్న వ్యాపారులు బ్యాంకు రుణం పొందాలంటే ఐటీ రిటర్న్స్‌ ఉండాలనే నిబంధన ఉంది. ఆదాయం లేకున్నా ఐటీ రిటర్న్స్‌ చూపించి రుణం పొందారు. వీరిని సైతం ఏరివేత జాబితాలో చేర్చారు.

తెల్ల రేషన్‌ కార్డు లబ్ధిదారుల్లోఐటీ గుబులు

తహసీల్దార్‌ నుంచి రేషన్‌ డీలర్లకు చేరిన జాబితా

వివరాలు సేకరిస్తున్న డీలర్లు

Advertisement
 
Advertisement
Advertisement