మహిళ హత్యకేసులో నిందితుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

మహిళ హత్యకేసులో నిందితుడి అరెస్ట్‌

Apr 14 2026 8:58 AM | Updated on Apr 14 2026 8:58 AM

చేర్యాల(సిద్దిపేట): ఈ నెల 9న లభ్యమైన మహిళ మృతదేహం కేసులో నిందితుడు షేక్‌ మౌలానాను అరెస్టు చేశారు. సోమవారం సీఐ కార్యాలయంలో హుస్నాబాద్‌ ఏసీపీ సదానందం కేసు వివరాలు వెల్లడించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపూర్‌కు చెందిన పఠాన్‌జెరీనా(మృతురాలు)కు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండల కేంద్రానికి చెందిన షేక్‌ మౌలానాకు 2024 ఏప్రిల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వీరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. తరచు ఫోన్‌లో మాట్లాడుకుంటూ కలుసుకునే వారు. ఈ క్రమంలో మృతురాలు నిందితుడి వద్ద నుంచి డబ్బులు డిమాండ్‌ చేసింది. డబ్బులు ఇవ్వకపోతే అతని ఇంటికి వచ్చి వారి మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెడతానని బెదిరించింది. దీంతో నిందితుడు మానసికంగా ఒత్తిడికి గురై, మృతురాలిపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 8న నిందితుడు తన కారులో మృతురాలిని చేర్యాల శివారులోని గుర్జకుంట వాగు దగ్గర ఎక్కించుకొని వైన్‌ షాపులో బీర్లు కొనుగోలు చేశారు. తర్వాత చేర్యాల మీదుగా చుంచనకోట దారిలో వెళ్లి ఓ చోట ఇద్దరు బీర్లు తాగారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య డబ్బుల విషయమై వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు మృతురాలిపై దాడి చేసి, స్కార్ప్‌తో గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం, మృతురాలి ఫోన్‌ను గుర్తు తెలియని ప్రదేశంలో పడేసి, ఇంటికి వెళ్లిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం చేర్యాల పట్టణ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి కారు, ఫోనును స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో సీఐ రమేశ్‌నాయక్‌, ఎస్‌ఐ అపూర్వరెడ్డి ఉన్నారు.

డబ్బులు అడగడంతోనే గొంతు నులిమి..

కేసు వివరాలు వెల్లడించిన ఏసీపీ

Advertisement
 
Advertisement
Advertisement