ఇంటర్‌లో ఫెయిలై.. ముగ్గురి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లో ఫెయిలై.. ముగ్గురి ఆత్మహత్య

Apr 14 2026 8:58 AM | Updated on Apr 14 2026 8:58 AM

నారాయణఖేడ్‌: ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో ఫెయిల్‌ కావడంతో వేర్వేరు చోట్ల ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మనూరు మండలంలోని ఎన్‌.జీ హుక్రాన గ్రామానికి చెందిన ఉప సర్పంచ్‌ ప్రేమ్‌కుమార్‌ కుమారుడు రమేశ్‌(17) నల్లవాగు గురుకులంలో ఇంటర్మీయెట్‌ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్నాడు. మృతుడి తల్లిదండ్రులు సుజాత, ప్రేమ్‌కుమార్‌ కర్ణాటకలోని బీదర్‌లో శుభకార్యానికి ఆదివారం ఉదయం వెళ్తూ పొలం వద్ద ఉన్న పశువులను చూసుకోవాలని రమేశ్‌కు చెప్పి వెళ్లారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో రమేశ్‌ ఫెయిల్‌ కావడంతో చేనువద్ద ఉన్న ఆవును తోలుకొస్తానని వెళ్లి పొలంలోని మేడి చెట్టుకు ఉరివేసుకున్నాడు.

కారాముంగిలో విద్యార్థిని...

కాగా నాగల్‌గిద్ద మండలం కారాముంగి గ్రామానికి అంబీనగర్‌ రవి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలసవెళ్లాడు. అతడి కూతురు నందిని (17) ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం చదువుతుంది. ఫలితాల్లో 470 మార్కులకు గాను 325 మార్కులు సాధించినా ఫెయిల్‌ అయ్యింది. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుంది. గ్రామంలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు.

సిద్దిపేటలో ఒకరు..

సిద్దిపేటకమాన్‌: ఇంటర్‌లో ఫెయిలవ్వడంతో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎల్లయ్య, మంజుల దంపతులు ఇద్దరి పిల్లలతో కలిసి రంగనాయకపురంలో నివాసం ఉంటున్నారు. మెట్టుబండ వద్ద హోటల్‌ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కూతురు ప్రత్యూష (17) అల్లీపూర్‌ కేజీబీవీలో సీఈసీ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతుంది. ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో ఫెయిల్‌ కావడంతో మనస్తాపానికి గురైంది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సెల్ఫీ వీడియో ఆన్‌ చేసి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుంది. మృతురాలి నానమ్మ గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement