సిద్దిపేట జిల్లాలో ఘటన
దుబ్బాకటౌన్: తండ్రి మరణాన్ని దిగమింగుకొని కూతురు పదవ తరగతి పరీక్షకు హాజరైంది. ఈ హృదయ విదారక ఘటన దౌల్తాబాద్ మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. చందా శ్రీనివాస్(35) గ్రామంలో కరెంటు వర్కర్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొద్ది రోజులుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. అతడికి కూతురు ఐశ్వర్య, కుమారుడు ఉన్నారు. కూతురు పదవ తరగతి చదువుతుంది. ఇంట్లో తండ్రి మృతదేహం ఉండగానే, కుటుంబ సభ్యుల ఆవేదన మధ్యలో తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరీక్షకు హాజరైంది. కన్నీటితోనే పరీక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె ధైర్యం అందరినీ కదిలించింది. తండ్రి కోరిక మేరకు చదువులో ముందుకు సాగాలని సంకల్పించిన ఐశ్వర్య బాధను పక్కనపెట్టి పరీక్ష రాసింది. ఒకవైపు కుటుంబానికి తీరని లోటు, మరోవైపు కుమార్తె చూపిన మనోధైర్యం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది.


