అర్హులైన పేదలకు ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులైన పేదలకు ఇళ్లు

Apr 13 2026 8:14 AM | Updated on Apr 13 2026 8:14 AM

నారాయణఖేడ్‌: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్‌ పట్టణంతోపాటు, మండలంలోని చాప్టా(కె), ర్యాకల్‌, లక్ష్మణ్‌నాయక్‌ తండా, మండల కేంద్రమైన నాగల్‌గిద్ద గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అవకాశం కల్పిస్తుందన్నారు. అర్హులైన ఇళ్లులేని పేదలు పథకం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బంజారా సేవాలాల్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్‌ చౌహన్‌, మాజీ ఎంపీటీసీ పండరీరెడ్డి, యాదవరెడ్డి, హన్మంతు, జ్ఞానేశ్వర్‌, జైపాల్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

5వ రోజుకు ఆర్టిజన్ల సమ్మె

జహీరాబాద్‌ టౌన్‌: తెలంగాణ విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్‌ కార్మికులు చేపట్టిన సమ్మె 5వ రోజుకు చేరుకుంది. జహీరాబాద్‌ డివిజన్‌ పరిధిలోని కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీవీఏఈ జేఏసీ చైర్మన్‌ ఆండ్రా సంతోష్‌కుమార్‌, కన్వీనర్‌ కృష్ణలు మాట్లాడుతూ.. ఆర్టిజన్లను క్రమబద్దీకరించడం కోసం సమ్మె చేస్తున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకా రం సంస్థల్లో ఒకే నిబంధన ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్హతలను బట్టి ఆర్టిజన్లను ఉద్యోగులుగా కన్వర్షన్‌ చేయాలని, ఏపీఎస్‌ఈబీ సర్వీస్‌ రూల్స్‌ వర్తింపజేయాలని, 2026 పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమ్మె కారణంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు కలుగుతున్నాయి. సమ్మెలో జేఏసీ నాయకులు జైపాల్‌, జక్కన్న, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

ఎస్‌టీపీ నిర్మాణం

రద్దు చేయాలి

అమీన్‌పూర్‌ పీపుల్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌

పటాన్‌చెరు: కాలనీల మధ్య ఎస్‌టీపీ ప్లాంట్‌ను నిర్మించవద్దని కాలనీల్లో ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. అమీన్‌పూర్‌ పీపుల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఆదివారం పట్టణ పౌరుల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ సంతకాలను తీసుకున్నారు.ఈ సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్షుడు తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ..అమీన్‌పూర్‌ పీపుల్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నివాస ప్రాంతంలో ప్రతిపాదిత ఎస్‌టీపీ (సెవేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌) నిర్మాణం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఎస్‌టీపీ నిర్మా ణాన్ని నివాస ప్రాంతాలకు దూరంగా మార్చా లని గట్టిగా డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, కార్యదర్శి నరేశ్‌, నర్సింహులు సభ్యులు పాల్గొన్నారు.

దుర్గమ్మా.. దీవించమ్మా

పాపన్నపేట(మెదక్‌): ఏడుపాయల ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఒడి బియ్యం పోసి, బోనాలు తీసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఎండల నుంచి తీవ్రతకు చెట్ల కింద సేదదీరారు. అక్కడే విందు చేసుకొని బందుమిత్రులతో సరదాగా గడిపారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌, ఆలయ సిబ్బంది చర్యలు తీసుకున్నారు.

రైతులను ఆదుకోండి

ఎమ్మెల్యే సునీతారెడ్డి

నర్సాపూర్‌: సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలలో తలెత్తిన అనిశ్చితిని తొలగించి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆదివారం లేఖ రాశారు. సింగూరు నుంచి నీరు విడుదల చేసినట్లు సమాచారం ఉన్నప్పటికీ, మంజీరా డ్యాం అధికారులకు సరైన ఆదేశాలు లేనందున క్షేత్రస్థాయిలో నీటి విడుదల జరగలేదన్నారు. ఈ విషయాన్ని గతంలో మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అసెంబ్లీలో సైతం ప్రస్తావించానని గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement