పాఠశాల సేవలు డిజిటలైజ్‌ | - | Sakshi
Sakshi News home page

పాఠశాల సేవలు డిజిటలైజ్‌

Apr 13 2026 8:14 AM | Updated on Apr 13 2026 8:14 AM

నారాయణఖేడ్‌: పాఠశాలల్లో విద్యార్థులకు అందించే సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా మార్చేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన వివిధరకాల సర్టిఫికెట్లు, రికార్డుల సవరణలను ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌ పద్ధతిలో అందించేందుకు విద్యాశాఖ యోచిస్తుంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ కసరత్తును ప్రారంభించింది. వచ్చే విద్యా సంవత్సరం ఈ విధానం అమలులోకి తెచ్చేందుకు ముమ్మరచర్యలు కొనసాగిస్తున్నారు. ఈ పారదర్శక విధానంతో ఉమ్మడి జిల్లాలోని విద్యార్థులకు మేలు చేకూరనుంది. ఉమ్మడి జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్న త పాఠశాలలు సంగారెడ్డి జిల్లాలో 1,265 ఉండగా ఇందులో 1,02లక్షల మంది విద్యార్థులు, మెదక్‌ జిల్లాలో 980 పాఠశాలల్లో 98 వేల మంది విద్యార్థులు, సిద్దిపేట జిల్లాలో 941 పాఠశాలల్లో 72వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

జాప్యానికి చెక్‌..

ప్రస్తుతం పాఠశాలల్లో ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ (టీసీ), బోనాఫైడ్‌ సర్టిఫికెట్‌ పొందాలన్నా, లేదా విద్యార్థి వివరాల్లో సవరణలు చేయాలన్నా, పదోతరగతి వివరాలు అప్‌డేషన్‌ వంటి పనుల కోసం విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు నేరుగా పాఠశాలకు వెళ్లాల్సి వస్తుంది. కొన్నిసార్లయితే ఎక్కడో మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌లోని స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో ఉన్నతాధికారులు, పాఠశాలల్లో హెచ్‌ఎంలు లేకపోయినా లేదా సంబంధిత క్లర్క్‌ సిబ్బంది అందుబాటులో లేకపోయినా సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనివల్ల తల్లిదండ్రులు స్కూల్స్‌, కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ సమస్యలన్నింటికీ చెక్‌ పెడుతూ డిజిటల్‌ పద్ధతిలో రికార్డుల నిర్వహణ చేపట్టడం ద్వారా నిర్ణీత సమయంలో సేవలు అందించాలని విద్యాశాఖ భావిస్తోంది.

మీసేవ కేంద్రాల ద్వారా...

ప్రతిపాదిత కొత్తవిధానం ప్రకారం పాఠశాల సేవలను మీసేవ కేంద్రాలకు అనుసంధానం చేయనున్నారు. విద్యార్థులు తమకు కావాల్సిన సర్వీసు కోసం ముందుగా మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు నేరుగా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి, అక్కడి నుంచి సంబంధిత మండల విద్యాశాఖ అధికారి లేదా పాఠశాల హెచ్‌ఎం లాగిన్‌లోకి చేరుతుంది. అధికారులు ఆన్‌లైన్‌లోనే వివరాలను ధ్రువీకరించి ఆమోదముద్ర వేయగానే మీ సేవ కేంద్రం నుంచి సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే వీలుండే దిశగా చర్యలు చేపడుతున్నారు. గతంలో డూప్లికేట్‌ మెమో కావాలంటే విద్యార్థులు నేరుగా బోర్డు కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుని రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. దీనిని గమనించిన బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (బీఎస్‌ఈ) ఇప్పటికే ఈ సేవను ఆన్‌లైన్‌ చేసింది. ప్రస్తుతం ఇది ప్రయోగాత్మక దశలో ఉన్నప్పటికీ సానుకూల ఫలితాలు వస్తుండటంతో ఇదే తరహాలో ఇతర పాఠశాలల సర్వీసులను కూడా డిజిటలైజ్‌ చేయాలని నిర్ణయించారు. అపార్‌ ఐడీలో వివరాలను ప్రతీ ఏటా అప్‌డేట్‌ చేస్తారు.

ఆన్‌లైన్‌ ద్వారా అందనున్న సర్వీసులు

విద్యార్థులు, తల్లిదండ్రులకు

తప్పనున్న తిప్పలు

వచ్చే విద్యా సంవత్సరం నుంచి

అమలుకు కసరత్తు

ఉమ్మడి జిల్లాలోని స్టూడెంట్స్‌కు మేలు

Advertisement
 
Advertisement
Advertisement