ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డును స్వీకరించినట్లు, జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు డాక్టర్ కల్లకుంట రాజేశ్వర్‌రెడ్డి ఆదివారం తెలిపారు. తెలు గు బుక్ ఆఫ్ రికార్డు సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ల్లో వివిధ కళా సేవా రంగాల్లో పలు అంశాలపై విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. జ్యోతిష్యరంగం, ఆధ్యాత్మిక, సాహిత్య రంగంలో చేసిన విశిష్ట సేవలను గుర్తించి హైదరాబాదులోని శ్రీ త్యాగరాయ గానసభలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డును అందజేసినట్లు తెలిపారు. అవార్డు రావడంపై రాజేశ్వర్‌రెడ్డిని జిల్లా ప్రముఖులు, మేధావులు ఆయనను అభినందించారు.
యువకుడు అదృశ్యం
శివంపేట(నర్సాపూర్): యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ సాయిలు వివరాల ప్రకారం.. మండలంలోని బీమ్లాతండా పంచాయతీ పరిధి శంకర్‌తండాకు చెందిన మాలోత్ జగన్(27) శనివారం రాత్రి ఇంటి నుంచి బైక్‌పై బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతడి ఆచూకీ కోసం బంధువుల వద్ద, చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో ఆదివారం యువకుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
భార్య ఆత్మహత్యకు కారణమైన భర్త అరెస్ట్
● వివరాలు వెల్లడించిన ఎస్‌ఐ
సిద్దిపేటకమాన్: భర్త వేధింపులతో మనస్తాపానికి గురై భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సిద్దిపేట వన్‌టౌన్ ఎస్‌ఐ నవత కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని పాత ఫిష్ మార్కెట్ ప్రాంతంలో అనంతోజు గోపాల్, శ్రీలత దంపతులు ఇద్దరు కూతుళ్లతో కలిసి నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. గోపాల్ మద్యానికి బానిసై ఏ పని చేయట్లేదు. డబ్బులు సంపాదించాలని తన భార్యను తిట్టి, కొట్టేవాడు. దీంతో భర్త వేధింపులు భరించలేక మనస్తాపంతో శ్రీలత ఇంట్లో ఉరి వేసుకుంది. ఘటనపై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితుడు మృతురాలి భర్త గోపాల్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
పాముకాటుతో
వలసకూలీ మృతి
తూప్రాన్: బతుకుదెరువు కోసం వలసవచ్చిన కార్మికుడు పాముకాటుతో మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన మండలంలోని నాగులపల్లిలో చోటు చేసుకుంది. తోటి కార్మికులు, గుత్తేదారు తెలిపిన వివరాల ప్రకారం..బీహార్‌కు చెందిన కుంధన్ మురుము(19) నాగులపల్లి శివారులోని నేచురల్ సీడ్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగా శనివారం పని ముగించుకొని పరిశ్రమ ప్రక్కనే గల షెడ్‌లో నిద్రించగా నాగుపాము కరిచింది. గమనించిన స్నేహితులు తూప్రాన్ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై కార్మికులను తరలించే గుత్తేదారు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


