చేర్యాలలో అగ్ని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

చేర్యాలలో అగ్ని ప్రమాదం

Apr 12 2026 6:35 AM | Updated on Apr 12 2026 6:35 AM

చేర్యాల(సిద్దిపేట): పట్టణ పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని మంటలార్పడంతో పెను ప్రమాదం తప్పింది. శనివారం స్థానిక 10వ వార్డు పరిధిలోని చావడి వద్ద చెత్తను అంటించే క్రమంలో భారీ మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఉమకు సమాచారం అందించగా.. ఆమె ఫైర్‌స్టేషన్‌కు ఫోన్‌ చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. దీంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

భర్త వేధింపులు తాళలేక..

వివాహిత ఆత్మహత్య

సిద్దిపేటకమాన్‌: భర్త వేధింపులతో మనస్తాపానికి గురైన వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. వన్‌టౌన్‌ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన అనంతోజు శ్రీలత (35), గోపాల్‌ దంపతులు స్థానికంగా పాత మార్కెట్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల క్రితం వివాహం కాగా మూడేళ్ల వయసులోపు శ్రీవల్లి, శ్రీలక్ష్మి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గోపాల్‌ గతంలో స్వర్ణకార పనులు చేయగా ప్రస్తుతం ఏ పని చేయకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భర్త వేధింపులతో మనస్తాపానికి గురైన శ్రీలత ఇంట్లో ఉరి వేసుకుంది. తెల్లవారుజామున కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్‌ ఎస్‌ఐ నవత సిబ్బందితో శనివారం ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై మృతురాలి తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులను చూసిన స్థానికులు అయ్యో పాపం అంటూ విచారం వ్యక్తం చేశారు.

రోడ్డు ప్రమాదంలో

ముగ్గురికి గాయాలు

ఒకరి పరిస్థితి విషమం

నర్సాపూర్‌ రూరల్‌: లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో నర్సాపూర్‌ – మెదక్‌ జాతీయ రహదారి, రెడ్డిపల్లి సమీపంలో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... ఓ డ్రైవర్‌ మద్యం మత్తులో రోడ్డుపై లారీని ఆపాడు. నర్సాపూర్‌ వైపు వస్తున్న కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం జల్దిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్‌, మరో బైక్‌పై కౌడిపల్లి మండలం తునికి గ్రామానికి చెందిన శంకర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంపై నిలదీస్తున్నారు. ఈ క్రమంలో నర్సాపూర్‌ వైపు నుంచి వస్తున్న కారు ఈశ్వర్‌, శంకర్‌ను ఢీకొట్టి అదుపుతప్పింది. బైక్‌పై ఉన్న ఈశ్వర్‌, శంకర్‌తో పాటు కారులో ఉన్న కౌడిపల్లి మండలం తునికి తండాకు చెందిన కాట్రోతు సాయికి గాయాలవ్వడంతో అంబులెన్స్‌లో నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఈశ్వర్‌తో పాటు తీవ్ర గాయాలైన శంకర్‌ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.

గాయాలపాలైన ఈశ్వర్‌, శంకర్‌

Advertisement
 
Advertisement
Advertisement