హల్దీలోకి జలాలు విడుదల
● యాసంగికి చింతలేదు ● సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు
వర్గల్(గజ్వేల్): హల్దీ పరివాహక ప్రాంతాల్లో యాసంగి పంటలకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. పంటలు ఎండిపోకుండా కొండపోచమ్మ సాగర్ గోదావరి జలాలు విడుదల చేయాలని వర్గల్ మండలంలోని హల్దీ పరివాహక ప్రాంత రైతుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం స్పందించింది. కొండపోచమ్మ సాగర్ సంగారెడ్డి కెనాల్ నుంచి నీరు విడుదల చేసేలా ఇరిగేషన్ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు శనివారం ఈఈ కవితాదేవి పర్యవేక్షణలో డీఈఈ సత్యవాస్, ఏఈఈ మురళీధర్‌రెడ్డి అవుసులోనిపల్లి ఆఫ్‌టెక్ తూము (సంగారెడ్డి కెనాల్) నుంచి కొండ పోచమ్మసాగర్ గోదావరి జలాలను హల్దీలోకి విడుదల చేశారు. బంధం చెరువు, వర్గల్ పెద్దచెరువు, శాకారం ధర్మాయచెరువు, అంబర్‌పేట ఖాన్‌చెరువు మీదుగా హల్దీలోకి నీరు చేరుతుందన్నారు. మూడు, నాలుగు రోజుల్లో నాచారం వరకు నాలుగు చెరువులు, 5 చెక్‌డ్యాంలు నిండుతాయన్నారు. రైతుల అభ్యర్థన మేరకు యాసంగిలో సాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని ఆమె పేర్కొన్నారు. కాగా గోదావరి జలాల విడుదలతో హల్దీ పరివాహకంలోని రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. కీలక దశలో వరి తదితర పంటలకు నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.


