● విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణం? ● లబోదిబోమంటున్న కొండాపూర్ రైతులు
నర్సాపూర్ రూరల్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఆరుగాలం కష్టపడి సాగుచేసిన వరి పంటలు ఎండిపోతున్నాయని మండలంలోని కొండాపూర్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రి తం సుమారు 20 మంది రైతులు అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు నాలుగు స్తంభాలు ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారుల సూచన మేరకు రైతులు డీడీలు చెల్లించారు. అప్పట్లో ఓ కాంట్రాక్టర్‌కు విద్యుత్ శాఖ అధికారులు పనులు అప్పగించగా.. అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు బిగించి స్తంభాలు ఏర్పాటు చేయకుండా వదిలేశాడు. అప్పటి నుంచి కొండాపూర్ రైతులు విద్యుత్ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. రెండు నెలల క్రితం నర్సాపూర్ ఏడీ రమణారెడ్డి వద్ద 20 మంది రైతులు కలిసి మొరపెట్టుకోగా మరో కాంట్రాక్టర్‌కు నాలుగు స్తంభాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. మరో కాంట్రాక్టర్ కూడా పనులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వరి పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే వరి పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని కొండాపూర్ రైతులు కోరుతున్నారు.


