‘రింగు రోడ్డు’ పనులు పూర్తిచేస్తా | - | Sakshi
Sakshi News home page

‘రింగు రోడ్డు’ పనులు పూర్తిచేస్తా

Apr 12 2026 6:35 AM | Updated on Apr 12 2026 6:35 AM

గజ్వేల్‌: భూ సేకరణ సమస్య వల్ల నిలిచిపోయిన గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ రింగు రోడ్డు పనులు పూర్తయ్యేలా చూస్తానని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. శనివారం సంగాపూర్‌ రోడ్డు వైపు నిలిచిపోయిన పనులను బీజేపీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు రామచంద్రం కోర్టుకెళ్లడం వల్ల 151 మీటర్ల మేర భూసేకరణ నిలిచిపోయి, పనులు సైతం పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రెండు, మూడు రోజుల్లో సదరు రైతుతో నేరుగా సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. రైతు ఒప్పుకుంటే...పనులు పూర్తి చేయడానికి మార్గం సుగమమవుతుందని, లేదంటే చట్టప్రకారం ముందుకువెళ్లి పనులు జరిగేలా చూస్తానన్నారు. గత నెల 22న జిల్లాలోని నర్మెటలో సీఎం రేవంత్‌రెడ్డి ఆయిల్‌ఫామ్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో తానూ ఈ విషయంపై విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం తన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి, సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తయ్యేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ భాస్కర్‌, బీజేపీ గజ్వేల్‌ పట్టణ శాఖ అధ్యక్షుడు మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు

Advertisement
 
Advertisement
Advertisement