ఓపెన్‌లోనూ వాట్సాప్ పాఠాలు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. చదువు మధ్యలో మానేసి 18 ఏళ్లు వయసు పైబడిన వారికి ఓపెన్ స్కూల్ ద్వారా చదువుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ ఏడాది అభ్యాసకుల హాజరు శాతం పెంచి, ఓపెన్ స్కూల్ తరగతులను అభ్యాసకులకు మరింత చేరువ చేసేందుకు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కొత్త వాట్సాప్ చానల్‌ను ప్రారంభించింది.
సెలవుల్లో మాత్రమే తరగతులు
గతంలో ఓపెన్ స్కూల్‌లో పది, ఇంటర్మీడియెట్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఏడాదంతా కేవలం రెండవ శనివారం, ఆదివారాల్లోనే తరగతులను నిర్వహించేవారు. వీకెండ్‌లో తరగతులు ఉండటంతో చాలామంది అడ్మిషన్ తీసుకున్నప్పటికీ తరగతులకు హాజరు కాకపోవడంతో అనుకున్న లక్ష్యం నీరుగారిపోయేది. ప్రభుత్వం అభ్యాసకులను పరీక్షలకు సన్నద్ధం చేయడానికి కావాల్సిన స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఈ విద్యా ఏడాది హాజరు శాతంతోపాటు ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కొత్తగా వాట్సాప్ చానల్‌ను ప్రారంభించింది. అందులో పదవ, ఇంటర్మీడియెట్ తరగతులకు సంబంధించి అభ్యాస దీపికలు అందుబాటులో ఉంచడమేకాకుండా ఎప్పుడూ లింక్ ఓపెన్ చేసినా పాఠాలు వచ్చేలా రూపకల్పన చేశారు.
103 అధ్యయన కేంద్రాలు
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా 103 అధ్యయన కేంద్రాలున్నాయి. వీటిలో సంగారెడ్డిలో 49, మెదక్‌లో 21, సిద్దిపేటలో 33 ఉన్నాయి. వీటిలో సంగారెడ్డిలో పదవ తరగతిలో 2,669, ఇంటర్మీడియెట్‌లో 4,680, మెదక్ జిల్లాలో పదవ తరగతిలో 1,016, ఇంటర్మీడియట్‌లో 2,887, సిద్దిపేట జిల్లాలో పదిలో 616 కాగా ఇంటర్మీడియట్‌లో 1,648 మంది అభ్యాసకులు ప్రవేశం పొందారు. ఓపెన్ స్కూల్‌లో ఉత్తీర్ణత పొందిన అభ్యాసకులకు సంబంధించిన ధ్రువపత్రాలకు సైతం రెగ్యులర్ సర్టిఫికెట్లతో సమాన ప్రాధాన్యత ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నా తదుపరి పదోన్నతుల కోసం కూడా ఓపెన్ ద్వారా తమ ఉన్నత చదువులను కొనసాగిస్తున్నారు.
ఈనెల 22 న బేస్‌లైన్ పరీక్షలు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఓపెన్ స్కూల్ అభ్యాసకులకు 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 22న బహుళ్ళైచ్ఛిక ప్రశ్నల రూపంలో బేస్‌లైన్ పరీక్షలను నిర్వహించనున్నట్లు డీఈఓ వెంకటేశ్వర్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అధ్యయన కేంద్రాల కో–ఆర్డినేటర్లు ఈ విషయంపై అభ్యాసకులకు సమాచారం అందించి, తప్పనిసరిగా పరీక్షకు హాజరయ్యేలా చూడాలన్నారు. మరిన్ని వివరాలకు ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కో–ఆర్డినేటర్ వెంకటస్వామి 8008403635ను సంప్రదించాలని సూచించారు.
వాట్సాప్ పాఠాలుసులభంగా అర్థమవుతున్నాయి
నేను ప్రైవేట్ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తాను. 7వ తరగతి వరకు చదివి మధ్యలో ఆపేశాను. చదువుకోవాలనే ఆశతో ఓపెన్ తరగతిలో ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ పొందాను. ప్రస్తుతం వాట్సాప్ చానల్ ద్వారా వీలైనప్పుడు చదువుకునే అవకాశం కల్పించారు. ఇందులో పాఠాలు కూడా చాలా సులభంగా అర్థమవుతున్నాయి.
– నరేశ్, పదవ తరగతి అభ్యాసకుడు
సద్వినియోగం చేసుకోవాలి
ఓపెన్ స్కూల్‌లో విద్యను అభ్యసించిన వారికి వచ్చే సర్టిఫికెట్లు రెగ్యులర్ సర్టిఫికెట్లతోపాటు సమానంగా ప్రాధాన్యత ఉంటుంది. అడ్మిషన్ పొందిన ఇంటర్మీడియెట్, పదవ తరగతి అభ్యాసకులు వాట్సప్‌లో పాఠాలు వచ్చేలా ప్రభుత్వం వాట్సప్ చానల్‌ను ప్రవేశపెట్టింది. ఈ అవకాశాన్ని ఓపెన్ స్కూల్ అభ్యాసకులు సద్వినియోగం చేసుకోవాలి.
– వెంకటస్వామి, ఓపెన్ స్కూల్,
ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్
ఉత్తీర్ణతశాతం
పెంచేందుకు చర్యలు


