ఈసారి నీటికి కటకటే! | - | Sakshi
Sakshi News home page

ఈసారి నీటికి కటకటే!

Feb 20 2026 11:07 AM | Updated on Feb 20 2026 11:07 AM

ఈసారి నీటికి కటకటే!

ఈసారి నీటికి కటకటే!

ప్రాథమికంగా అంచనాకు వచ్చినమిషన్‌భగీరథ అధికారులు జహీరాబాద్‌ ‘ఖేడ్‌’ప్రాంతాలలోతాగునీటి సమస్య తలెత్తే అవకాశం వేసవి కార్యాచరణ ప్రణాళికపైకసరత్తు షురూ జిల్లాలో మొత్తం 852 గ్రామీణనివాసిత ప్రాంతాలు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఈ వేసవిలో జిల్లాలో సుమారు 220 నివాసిత ప్రాంతా(ఆవాసా)ల్లో తాగునీటికి ఎద్దడి ఏర్పడే అవకాశాలున్నట్లు మిషన్‌భగీరథ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రధానంగా నారాయణఖేడ్‌ ప్రాంతంలోని మారుమూల మండలాల గ్రామాలు, జహీరాబాద్‌ ప్రాంతంలోని కొన్ని మండలాల్లో తాగునీటి సమస్య తలెత్తుందని భావిస్తున్నారు. కంగ్టి, కల్హేర్‌, నాగల్‌గిద్ద, సిర్గాపూర్‌లోని కొన్ని గ్రామాలు, జహీరాబాద్‌ ప్రాంతంలోని న్యాల్‌కల్‌, రాయికోడ్‌ తదితర గ్రామాల్లో తాగునీటి సమస్య ఎదురవుతుందని అంచనావేస్తున్నారు. ఇక్కడ తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించాలని భావిస్తున్నారు. కాగా, జిల్లాలో మొత్తం 852 గ్రామీణ నివాసిత ప్రాంతాలు ఉన్నాయి. మిషన్‌భగీరథ సింగూరు వాటర్‌ గ్రిడ్‌ ద్వారా ఈ నివాసిత ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు.

ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ

అయితే ఈసారి వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాగునీటి సమస్య వస్తే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆశాఖ మండలాల ఏఈలకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు ఏఈలు నీటి ఎద్దడికి అవకాశాలున్న గ్రామాలను గుర్తిస్తున్నారు. ఆయా గ్రామాల్లో చేతిపంపులు, త్రీఫేజ్‌ పంపులు, ఓపెన్‌ వెల్స్‌ వంటి లోకల్‌ సోర్స్‌ ఏమేమి ఉన్నాయనే వివరాలు సేకరిస్తున్నారు. ఏదైనా తాగునీటి పథకానికి సంబంధించిన పైప్‌లైన్‌లు లీకేజీలు ఎక్కెడెక్కడ ఉన్నాయి. వంటి వివరాలను కూడా తీసుకుంటున్నారు. ముందుజాగ్రత్తగా ఎక్కడైనా వట్టిపోయిన బోర్లకు మరమ్మతులు చేయించడం వంటి చర్యలపై దృష్టి సారించారు. వాటర్‌ గ్రిడ్‌ నీటి సరఫరా ఫెయిల్‌ అయినపక్షంలో లోకల్‌ సోర్స్‌ కూడా లేని గ్రామాల్లో గ్రామ పంచాయతీ ట్యంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాల్సిన గ్రామాలను కూడా గుర్తిస్తున్నారు. మిషన్‌ భగీరథ ఏఈలు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు ఈ సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు.

ఈసారికి సింగూరు సమస్య లేదు

సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతు పనులు చేస్తున్న విషయం విదితమే. ఇందుకోసం ప్రాజెక్టునుంచి నీటిని తోడేశారు. ఎనిమిది టీఎంసీలకు తగ్గించారు. అయితే జిల్లా అంతటికీ సింగూరు ప్రాజెక్టునే ప్రధాన ఆధారం. ఈ వేసవికి నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని నీటి పారుదలశాఖ ఽఅధికారులు తెలిపారు. ఎనిమిది టీఎంసీల నుంచి నీటిని సరఫరా చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

నీటి ఎద్దడి 220 ఆవాసాలు

ఆలస్యంగా స్పందించిన శాఖ

వేసవి కార్యచరణ ప్రణాళిక విషయంలో మిషన్‌ భగీరథ అధికారులు ఆలస్యంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే వేసవి ముంచుకొచ్చింది. ఇప్పుడే ఎండల తీవ్రత పెరుగుతుంది. వచ్చే నెల మార్చిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఏప్రిల్‌, మేలలో భానుడి ప్రతాపం అధికంగా ఉంటుంది. అధికారులు ఇప్పటికే సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేసి అమలు చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు పనులను గుర్తించి..వాటి మరమ్మతు పనులు చేపట్టాలంటే కనీసం నెల రోజులైనా సమయం కావాలి. ఇప్పటికీ ఇంకా యాక్షన్‌ ప్లాన్‌నే తయారుకాకపోతే, ఎప్పుడు తయారు చేసి ప్రతిపాదనలు పంపుతారు. ఎప్పుడు ప్రభుత్వానికి పంపి అనుమతులు పొందుతారు? పనులు ఎప్పుడు చేస్తారు? వంటి అంశాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఇప్పటికే అంచనాలకు ప్రభుత్వ అనుమతి లభించి ఉంటే వేసవి వచ్చేసరికి మరమ్మతు పనులు పూర్తి చేసి తాగునీటి సమస్య తలెత్తే అవకాశాలే ఉండేవి కావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీలైనంత త్వరగా ఈ వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మిషన్‌భగీరథ శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పాషా ‘సాక్షి’తో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement