
కరవు నేలను ముద్దాడిన వరద నీరు..!
హుస్నాబాద్‌రూరల్:
భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలకు సాగునీరు అందక రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. చేతికొచ్చిన పంటలను సరిపడా నీరందక పశువుల మేతకు వదిలేసిన దాఖలాలు ఉన్నాయి. పెట్టుబడుల భారంతో మెట్ట రైతులు ఆర్థిక నష్టాలను సైతం భరిస్తున్నారు. అయితే.. నిత్యం వేధించే సాగునీటి సమస్యను శాశ్వతంగా దూరంగా చేయాలని ఓ రైతు ప్రయత్నం ఫలించింది. ఆర్థిక కష్ట, నష్టాలు.. కొన్ని సందర్భాల్లో నిరాశ పరిచినా ఎక్కడా వెనుకడుగు వేయలేదు.
హుస్నాబాద్ మండలం గాంధీనగర్‌కు చెందిన రైతు మాదారపు రాంగోపాల్‌రావు తన ఆలోచనలకు పదును పెట్టి ఏకంగా ఇరవై ఎకరాలకు సాగునీరందేలా చేసిన కృషి ఇప్పుడు సత్ఫలితానిస్తోంది.
కోర్టు కేసుల కారణంగా మొన్నటి వరకు గోదావరి జలాలతో గౌరవెల్లి ప్రాజెక్టు నింపితే పంటలకు కావాల్సిన సాగు నీరు అందుతుందన్న ఆశలను రైతులు వదులుకున్నారు. రెండేళ్లు యాసంగి పంటలకు సాగు నీరందక పంటలు ఎండిపోతే చాలా మంది రైతులు చేసేదేమిలేక పశువుల మేతకు వదిలేశారు. అయితే.. రాంగోపాల్‌రావు మాత్రం తన ముందున్న ప్రతికూల పరిస్థితులకు భయపడలేదు. మెదడుకు పదును పెట్టాడు. గతంలో ఊటబావి తవ్వించాడు. నీరు పడలేదు. సరిగా నీరందక ఎండిన పంటలను పశువుల మేతకు వదిలేసి.. మరో బావిని తవ్వే పనులు మొదలు పెట్టాడు. రూ.5 లక్షల వ్యయంతో 25 గజాల బావి తవ్వించి సిమెంట్ రింగ్‌లు పోయించాడు. వేసవిలో నీరు లేకపోయినా నిరుత్సాహపడలేదు, బావి పక్కనే 10 గుంటల విస్తీర్ణంలో చిన్న కొలను తవ్వించి.. అందులోకి వరద నీటిని మళ్లించి చిన్న చెరువులా చేశాడు. దీంతో బావిలో నీటి ఊటలు రావడం ప్రారంభమైంది. చూస్తుండగానే బావిలో నీరు పుష్కలంగా ఉండటంతో పంటలకు సాగునీటి కొరత లేకుండా పోయింది. తన పదెకరాల పొలంతో పాటు అదనంగా మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకొని బీడు భూమిని చదును చేసి వరి సాగు చేస్తున్నాడు రాంగోపాల్‌రావు. నిన్నటి వరకు నీళ్లు లేని బావులు ఇప్పుడు చిన్న కొలను ఏర్పాటు చేయడం ద్వారా రెండు ఊట బావుల్లో భూగర్భ జలాలు ౖపైపెకి వచ్చి రైతులను అశ్చర్య పరుస్తున్నాయి. రెండేళ్ల రైతు శ్రమకు కావాల్సిన సాగు నీరు రావడంతో రాంగోపాల్‌రావు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
కష్టపడితే నీళ్లరేవొచ్చింది
గౌరవెల్లి ప్రాజెక్టు నింపితే పంటలకు సాగు నీరు వస్తుందని ఆశపడ్డాం. ఇప్పుడు కోర్టు కేసులతో గోదావరి జలాలు వచ్చే నమ్మకం లేదు. రెండేళ్లు పది ఎకరాల్లో పంట ఎండి రూ.10లక్షల నష్టం వచ్చింది. కష్టపడి బావి తవ్వితే.. ఇప్పుడు నీళ్ల రేవు వచ్చింది. నీటి కొలనుతో బావిలో ఊట నీరు పెరిగింది. పంటలకు కావాల్సిన నీళ్లు రెండు బావులు అందిస్తున్నాయి. రాంగోపాల్‌రావు, రైతు
వరద నీరు మళ్లించి కొలను ఏర్పాటు
బావుల్లో ఊట పెరగడంతో పాతాళ గంగ ౖపైపెకి ..
బీళ్లకు నీరు పారించిపంటలు సాగు చేస్తున్న రైతు
20 ఎకరాలలో వరి, మొక్కజొన్నపంటల సాగు
సత్ఫలితాలిస్తున్న రైతు రాంగోపాల్‌రావు కృషి
ఓ రైతు భగీరథయత్నం ఫలించింది. కరువుతో అల్లాడుతున్న ఆ నేలకు వరద నీరు ముద్దాడేలా చేశాడు. బీడు భూములను సస్యశ్యామలం చేశాడు.