
ప్రాణాలు పోతున్నా.. హెల్మెట్లు పెట్టరా..?
● ప్రతినెల సగటున 11 మంది మృత్యువాత ● జిల్లావ్యాప్తంగా ఏడు నెలల్లో400 ప్రమాదాలు ● 179 మరణాలు.. ద్విచక్ర వాహనదారులు 118 మంది ● జరిమాన విధించినా కానరాని మార్పు
కలెక్టర్ కట్టడిచేసినా..
ద్విచక్రవాహన దారులు తప్పకుండా హెల్మెట్లు ధరించాలని, లేకుంటే కలెక్టరేట్ ఆవరణలోకి అనుమతించ వద్దని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఫిబ్రవరిలో తన సిబ్బందిని ఆదేశించారు. దీంతో కలెక్టరేట్‌కు వెళ్లే ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించే కార్యాలయానికి వెళ్లేది. ఆ నెలలో 95శాతం మంది ద్విచక్రవాహన దారులు హెల్మెట్లు ధరించారు. కొంత కాలం తర్వాత మళ్లీ యథాస్థితే. కాగా, జిల్లాలో హెల్మెట్ ధరించని వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నా వాహనదారుల్లో మార్పు కానరావడం లేదు. ఈ విషయమై అధికారులు కఠినంగా వ్యవహరించాల్సి అవసరం ఎంతైనా ఉంది.
మెదక్‌జోన్: ‘‘హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనం నడపొద్దు.. లేకుంటే ప్రాణాలకే ప్రమాదం’’అని పోలీసులు ఎంత అవగాహన కల్పించినా వాహనదారుల్లో మాత్రం ఆశించిన మార్పు కనిపించడం లేదు. నిత్యం జరిమానాలు విధించినా ఫలితం లేకుండా పోతుంది. ఫలితంగా జిల్లాలో ప్రతినెల సగటున 11 మంది హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులకు శోకం మిగుల్చుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు ఏడు మాసాల్లో 400 రోడ్డు ప్రమా దాలు జరిగాయి. అందులో 179 మంది మరణించారు. వారిలో 118 మంది ద్విచక్ర వాహనదారులు కాగా, 61 మంది ఇతర వాహనదారులు ఉన్నారు. కేవలం హెల్మెట్లు ధరించక పోవటంతోనే 76 మంది మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు.
రోడ్ల మీదకు వస్తున్న కుటుంబాలు
రోడ్డు ప్రమాదంలో కుటుంబపెద్ద మరణిస్తే.. ఆ కుటుంబం రోడ్డు మీదకు వస్తోంది. పిల్లల చదువులు ఆగిపోతాయి. కుటుంబ భారం మహిళపై పడుతోంది. ఒకవేళ పెళ్లికాని యువత చనిపోతే జన్మనిచ్చిన తల్లి దండ్రులకు తీరని కడుపు కోత మిగిలిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ కుటుంబమే రోడ్డుపైకి వస్తోంది. ఇంత జరుగుతున్నా ద్విచక్రవాహన దారులు హెల్మెట్లు ధరించకుండా నిర్లక్ష్యంగా నడపటం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.

ప్రాణాలు పోతున్నా.. హెల్మెట్లు పెట్టరా..?