
కొత్త కార్డులకూ సంక్షేమ పథకాలు!
నారాయణఖేడ్: రాష్ట్రంలో ప్రస్తుతం నూతనంగా జారీ చేస్తున్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించేందుకు చర్యలు చేపట్టింది. ఆరోగ్యశ్రీతోపాటు అన్ని రకాల సంక్షేమ పథకాలను ఈ నూతన కార్డుదారులకు కూడా అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కార్యాచరణను రూపొందిస్తున్నారు. పథకాల అమలుతో జిల్లాలో నూతనంగా రేషన్ కార్డులు పొందిన వారందరికీ మేలు చేకూరనుంది. చాలా పథకాలు రేషన్‌కార్డులు లేకపోవడంతో లబ్ధి పొందలేకపోతున్నారు. దాదాపు అన్ని పథకాలకు రేషన్‌కార్డే ప్రామాణికం కావడంతో ఇన్నాళ్లూ కార్డులులేని వారు పలు పథకాలను పొందలేకపోయారు. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించనుంది. దీంతో జిల్లాలో రేషన్ కార్డుదారుల్లో సంతోషం నెలకొంది.
అనుమతి పొందిన దరఖాస్తులు 56,324
జిల్లాలో నూతనంగా రేషన్ కార్డుల కోసం 81,587మంది దరఖాస్తు చేసుకున్నట్లు డీఎస్‌ఓ అధికారులు తెలిపారు. ఇందులో 56,324 దరఖాస్తులు అనుమతి పొందగా...13,767 అప్లికేషన్లను తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఇంకా 11,496 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పాత రేషన్ కార్డులు 3,78,511కాగా, ఇందులో సభ్యులు 19,32,137 ఉన్నారని తెలిపారు. నూతనంగా మంజూరైన, మంజూరు కానున్న రేషన్‌కార్డు లబ్ధిదారులు సంక్షేమ పథకాలకు అర్హులు కానున్నారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ కోసం ప్రత్యేక విభాగం
ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం సేవలను రేషన్ కార్డుదారులకు రూ.10లక్షల వరకు పెంచి అవకాశం కల్పించింది. నూతన కార్డుదారులందరికీ ప్రథమంగా ఆరోగ్యశ్రీ సేవలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయియించింది. ఇందుకోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా పౌరసరఫరాల శాఖతో సమన్వయం చేసుకుని కొత్తగా రేషన్ కార్డులు మంజూరైన వారి వివరాలతోపాటు పాతకార్డులో కొత్తగా చేరిన కుటుంబ సభ్యుల వివరాలను ఆరోగ్యశ్రీలో నమోదు చేస్తారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఉన్నతాధికారులకు ఆదేశించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున వీలైనంత త్వరగా రేషన్ కార్డుల పంపిణీ, ఆరోగ్యశ్రీ అనుసంధాన ప్రక్రియ కూడా పూర్తి చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అనుసంధాన ప్రక్రియ పూర్తి కాగానే నెట్‌వర్క్ ఆస్పత్రుల ద్వారా నిబంధనల మేరకు ఉచిత వైద్య సేవలు అందుతాయి.
త్వరలో అమలుకు శ్రీకారం
మొదట రాజీవ్ ఆరోగ్యశ్రీ.. తర్వాత అన్ని పథకాలూ వర్తింపు
నమోదు కోసం ఇళ్లవద్దకే అధికారులు
ఇతర పథకాలు కూడా..
రాజీవ్ ఆరోగ్యశ్రీతోపాటు ఇతర పథకాలను కూడా కార్డుదారులకు అందించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వ్యక్తం చేసింది. ఇప్పటికే అమలు చేస్తున్న వివిధ గ్యారంటీలను కొత్త రేషన్ కార్డులకు కూడా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని భావిస్తోంది. ఈ డ్రైవ్‌లో అధికారులే నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారి వివరాలను నమోదు చేసుకుని అవసరమైన అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయనున్నారు. దీనివల్ల లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలు పొందనున్నారు. కాగా, రేషన్ కార్డు స్థానంలో ప్రస్తుతం మంజూరు పత్రాలు జారీ చేయగా త్వరలో డిజైన్‌ను ఖరారు చేసి రేషన్ కార్డులను జారీ చేయనున్నారు.