సర్వేయర్ల కొరతకు చెక్
భూ సర్వే పరిష్కారానికి చర్యలు
● త్వరలో రానున్న లైసెన్స్‌డ్ సర్వేయర్లు ● ఈనెల 17 వరకు దరఖాస్తుల స్వీకరణ
శిక్షణ ఫీజుల వివరాలు
ఓసీ అభ్యర్థులు రూ. 10,000
బీసీ అభ్యర్థులు రూ. 5,000
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 2,500
సంగారెడ్డి జోన్: జిల్లాలో భూ సర్వే సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పలు మండలాల్లో సర్వేయర్ల కొరత తీవ్రస్థాయిలో ఉండటంతో భూ సర్వే సమస్యలు పేరుకుపోతున్నాయి. దీంతో లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అర్హతతో పాటు ఆసక్తి కలిగి ఉన్న వారిని ఎంపిక చేసి శిక్షణ అనంతరం లైసెన్స్‌లు జారీ చేయనున్నారు.
పరిష్కారానికి నోచుకోని
భూ సర్వే సమస్యలు
గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి చట్టంతో వివిధ రకాల భూ సమస్యలు అధికమయ్యాయి. అందులోభాగంగా భూమి, సర్వే నంబర్ మిస్సింగ్‌తోపాటు వాస్తవంగా ఉన్న విస్తీర్ణం కంటే ఎక్కువ, తక్కువగా నమోదై ఉండటం, ఒకరిపేరుతో కాకుండా మరొకరిపేరుతో ఆన్‌లైన్‌లో చూపించటంతో పాటు అనేకరకాల సమస్యలు నెలకొన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి ప్రధానంగా సర్వేయర్లు అవసరం. జిల్లాలో చాలాచోట్ల ఇన్‌చార్జిలుగా వ్యవహరించడం, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో నిమగ్నమై ఉండటంతో భూ సర్వే సమస్యలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
సర్వేయర్ల కొరత తీరుస్తూ
ప్రతీ మండలానికి ఒక సర్వేయర్ ఉండాలి. అయితే జిల్లాలో మొత్తం 28 మండలాలకు గాను 15 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారు. 1,67,948 సర్వే నంబర్లు, సుమారు 8 లక్షల ఎకరాల భూ విస్తీర్ణం కలిగి ఉంది. ఆయా మండలాల్లో సుమారు నాలుగువేలకు పైగా సర్వే కోసం దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ
లైసెన్స్ సర్వేయర్ల నియామకం కోసం అభ్యర్థుల నుంచి ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 17 వరకు మీసేవ కేంద్రాల్లో రూ.100లు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియెట్‌లో గణిత శాస్త్రం ఒక సబ్జెక్టు కలిగి ఉండి 60% మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఐటిఐ డ్రాఫ్ట్‌మెన్(సివిల్), డిప్లమో సివిల్, బీటెక్ సివిల్ లేదా ఇతర సమానమైన విద్యార్హతలు కలిగి ఉండాలి.
60 మంది ఎంపికకు కసరత్తు
జిల్లాలో 60 మంది లైసెన్స్ సర్వేయర్ల ఎంపికకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యార్హతలను బట్టి ఎంపిక చేసిన వారికి 50 రోజులపాటు శిక్షణనివ్వనున్నారు. అందులో ఉత్తీర్ణులైన వారికి 42 రోజులపాటు క్షేత్రస్థాయిలో సర్వేయర్ కింద శిక్షణనిస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారికి రాష్ట్రస్థాయిలో నిర్వహించే పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి భూమి సమాచార నిర్వహణ విభాగం నుంచి లైసెన్స్ సర్వేయర్‌గా ఉత్తర్వులు జారీ చేస్తారు.
అర్హులు దరఖాస్తు చేసుకోవాలి
లైసెన్స్ సర్వేయర్ కోసం ఆసక్తి ఉండి అర్హులైన వారు ఈ నెల 17 వరకు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికై న వారికి నిబంధనల మేరకు శిక్షణ అందించి లైసెన్సులు జారీ చేస్తారు.
–ఐనేష్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ, సంగారెడ్డి
సర్వేయర్ల కొరతకు చెక్


