సకల సౌకర్యాలతో..
కేజీబీవీల్లో మెరుగైన వసతులు
న్యాల్‌కల్(జహీరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. ఇందులో భాగంగా కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థినులకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఏక రూప దుస్తులు, రుచికరమైన భోజనం, విద్యా బోధన వంటి సౌకర్యాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. దీంతో పాటు ఆంగ్ల మాధ్యమంలో బోధన, బాలికలకు భద్రత, డిజిటల్ తరగతులు, హాస్టల్ వసతి కల్పిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం విడతల వారీగా మెరుగైన వసతుల కల్పనపై దృష్టి సారించింది. అంతేకాకుండా విద్యార్థినులకు బంకర్ బెడ్లను సైతం అందించేందుకు శ్రీకారం చుట్టింది.
విద్యార్థులకు వరం..
జిల్లా వ్యాప్తంగా 22 కేజీబీవీలు ఉన్నాయి. దాదాపు 6 నుంచి 10వ తరగతి వరకు నిర్వహిస్తుండగా.. ఇందులో 17 విద్యాలయాలు ఇంటర్మీడియట్ వరకు కొనసాగుతున్నాయి. జిల్లాల్లో ఉన్న కేజీబీవీల్లో ప్రస్తుతం 6వేల మంది విద్యార్థినులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరందరికీ ఆంగ్లంలో విద్యాబోధన, ఉచిత పాఠ్య పుస్తకాలు, హాస్టల్ వసతి వంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తూ మెరుగైన విద్యనందిస్తుంది. అయితే ఆయా విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినులకు బెడ్లు లేకపోవడంతో నేలపైనే నిద్రపోతూ ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా చలి కాలంలో చలి తీవ్రతతో నిత్యం నరకయాతన పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం విద్యార్థులందరికీ బంకర్ బెడ్లు, బెడ్ షీట్లు తదితర సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టడం విద్యార్థినులకు వరంగా మారినట్లయింది. విద్యాలయాలల్లో ఎంత మంది విద్యార్థినులున్నారు? ఏయే విద్యాలయాల్లో వాటిని ఏర్పాటు చేయవచ్చు? వంటి వివరాలను జిల్లా అధికారులు సేకరించి రాష్ట్ర స్థాయి అధికారులకు సైతం పంపించారు.
అధికారులకు నివేదికలు..
20 కేజీబీవీల్లోని 2,888 విద్యార్థినులకు బంకర్ బెడ్లు అవరమని జిల్లా అధికారులు ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు. అయితే అందులో బంకర్ బెడ్లు ఏర్పాటు చేసేందుకు 16 విద్యాలయాల్లో మాత్రమ సౌకర్యాలున్నాయని నివేదించారు. దీంతో బంకర్ బెడ్ల కాంట్రాక్ట్‌ను తీసుకున్న తోషిభా కంపెనీ ఆయా విద్యాలయాలకు వాటిని సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు 11 కేజీబీవీలకు బెడ్లను పంపిణీ చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. మిగిలిన 5 కేజీబీవీలకు పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. బంకర్ బెడ్ల పంపిణీ పూర్తయితే విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీరనున్నాయి.
ఉన్నత విద్యతో పాటు రుచికరమైన భోజనం
బంకర్ బెడ్లు పంపిణీకి శ్రీకారం
తొలగనున్న విద్యార్థినుల ఇబ్బందులు
సకల సౌకర్యాలతో..


