మా భూములు వదులుకోం
న్యాల్‌కల్(జహీరాబాద్): ప్రాణాలైనా ఇస్తాం, కానీ మూడు పంటలు పండే బంగారం లాంటి భూములను మాత్రం కాలుష్య కారక పరిశ్రమలకు ఇచ్చే ప్రసక్తే లేదని ప్రజలు స్పష్టం చేశారు. మండల పరిధిలోని మల్గి గ్రామంలో కాలుష్య కారక పరిశ్రమల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆదివారం గ్రామ సభ నిర్వహించారు. ఈసందర్భంగా టీపీజేఏసీ జిల్లా అధ్యక్షుడు అశోక్ కుమార్, ప్రతినిధులు లక్ష్మి తదితరులు మాట్లాడుతూ.. ఫినాల్, మెఽథనాల్ లాంటి కాలుష్య కారక పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల గ్రామంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని గాలి, నీరు, పంట పొలాలు, మంజీరా నది కలుషితమవుతుందని తెలిపారు. అవి ఏర్పాటు కాకుండా చూడాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రస్తుతం కాలుష్యం వల్ల ఇబ్బందులు పడుతున్న పలు ప్రాంతాల గురించి ప్రజలకు వివరించారు. వచ్చే నెల 3న గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అనంతరం పరిశ్రమల ఏర్పాటు వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్‌గౌడ్‌తో పాటు షౌకత్ అలీ, మంగళ, మారుతి, సంజీవరెడ్డి, సిద్దన్న పాటిల్, అజీమోద్దీన్, రాజు, మహేశ్‌రెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్సే
సంగారెడ్డి: దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు నిర్మలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు ఆస్తులు, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకెళ్లారని కొనియాడారు. బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియాలో కాంగ్రెస్‌పై దుష్ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. నాయకులు ఫొటోలు మార్ఫింగ్ చేసి యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారి కుట్రను గ్రహించాలని హితవు పలికారు. కరెన్సీ నోట్ల మీద గాంధీ ఫొటో తీసేయాలని మోదీ, అమిత్‌షా కుట్ర చేస్తున్నారన్నారు. గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబ చరిత్ర దేశంలో లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. నెహ్రూ కేబినెట్‌లో అంబేడ్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉండి, సమస్త కులాలు, మతాల ప్రజలు స్వేచ్ఛగా ఉండాలని రాజ్యాంగం రాశారని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ఆంజనేయులు, సీడీసీ రామ్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుగౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సదాశివపేట మండల పార్టీ అధ్యక్షుడు సిద్దన్న, సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు జార్జ్, బుచ్చిరాములు, నర్సింహారెడ్డి, నాయకులు కూన సంతోష్, కిరణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కాలుష్య కారక పరిశ్రమలకు ఇవ్వం
ఏకగీవ్రంగా తీర్మానించిన
మల్గి గ్రామస్తులు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
మా భూములు వదులుకోం


